రాష్ట్రంలో తొలిసారిగా మహిళా స్వయం సహాయక బృందాలకు రుణలక్ష్యం నెరవేరింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) పరిధిలోని 2.71 లక్షల సంఘాలకు బ్యాంకుల ద్వారా 2020-21 ఏడాదిలో మార్చి 31 నాటికి రూ.10,431 కోట్ల రుణాల పంపిణీ పూర్తయింది. కరోనా కాలంలోనూ గ్రామీణ మహిళలు 98 శాతం రుణాలను తిరిగి చెల్లించారు. రాష్ట్రంలో 4.3 లక్షల మహిళా సంఘాలున్నాయి. వీటి పరిధిలో 46 లక్షల మంది సభ్యులు ఉన్నారు.
2020-21 ఏడాదికి 3.13 లక్షల స్వయం సహాయక బృందాలకు రూ.10,272 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే రాష్ట్రంలో లాక్‌డౌన్ మొదలైంది. గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థకు ఇబ్బంది రాకూడదన్న ఉద్దేశంతో మహిళా సంఘాలకు రుణాలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో రుణపరిమితి గరిష్ఠంగా రూ.5-7 లక్షల వరకే ఉండగా.. తాజాగా ప్రభుత్వం రూ.10 లక్షలకు పెంచింది. జనవరి నాటికి 80 శాతం పూర్తయిన రుణాలు.. మార్చి నాటికి లక్ష్యానికి మించి రుణపంపిణీ జరిగింది. రాష్ట్రసగటు నూరు శాతం లక్ష్యం దాటినా, 9 జిల్లాల్లో నూరుశాతానికి లోపు పంపిణీ చేశారు. మిగతా 19 జిల్లాల్లో శతశాతం దాటింది. అత్యల్పంగా కుమురంభీం జిల్లాలో 84.23 శాతం.. అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో 109.69 శాతంగా ఉంది.
మహిళా సంఘాల రుణాలకు వడ్డీరేట్లను బ్యాంకులు తగ్గించాయి. బ్యాంకర్ల సంఘం 14.5 నుంచి 12 శాతానికి రుణ వడ్డీరేట్లను తగ్గించింది. సంఘాలు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తున్నా వడ్డీరాయితీ పథకాలు అమలవ్వడం లేదు. 2021-22కి రూ.3వేల కోట్లను ప్రభుత్వం వడ్డీరహిత రుణాల కింద బడ్జెట్‌లో ప్రతిపాదించింది.
ఇదీ చూడండి: ఆవేదనతో పంటకు నిప్పు పెట్టిన రైతు