నాలుగు రోజుల క్రితం వరకు కళకళలాడిన ఏపీలోని ఆర్‌ఆర్ వెంకటాపురంలో ఎటుచూసినా నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. స్థానికులు ఇళ్లను ఖాళీ చేసి శిబిరాలకు తరలిపోవడం వల్ల పాడుబడ్డ గ్రామంలా దర్శనమిస్తోంది. విష వాయువుల ప్రభావం ఆ గ్రామ పరిసరాల్లో ఇంకా కనిపిస్తోంది. రసాయన వాసన వెదజల్లుతోంది. పరిసరాల్లో ఎక్కువసేపు ఉంటే తలనొప్పి, కళ్లు తిరగడం తప్పట్లేదు. చెట్లు, మొక్కలు నల్లగా మాడిపోయాయి. పక్షులు, జంతువులు ఇటువైపు రావడం లేదు. కాలువల్లో మురుగునీరు నురగతో ప్రవహిస్తోంది. చనిపోయిన జంతువులు, పక్షుల కళేబరాలను తరలించకపోవడం వల్ల కుళ్లిన వాసన వ్యాపిస్తోంది. శనివారం ఇక్కడ పర్యటించిన డీజీపీ గౌతమ్ సవాంగ్ ఘాటైన దుర్వాసన తట్టుకోలేక త్వరగా వెళ్లిపోయారు. అక్కడ పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య పనులు చేపట్టకపోతే అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని పలువురు చెబుతున్నారు.
నాయకుల అడ్డగింత
ఎల్‌జీ పాలిమర్స్ వద్ద ధర్నాకు వెళ్లేందుకు వచ్చిన తెదేపా నాయకులు మాజీమంత్రి బండారు, మాజీ ఎమ్మెల్యేలు పీలా గోవింద సత్యనారాయణ, పల్లా శ్రీనివాస్‌లను పోలీసులు అనుమతించలేదు. ఏపీ డీజీపీ, మంత్రులు వెళ్లిన తర్వాత కూడా అనుమతించకపోవడం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి...చిన్నారులపై విషవాయు ప్రభావం