TCSS Telangana : తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ పదకొండో వార్షిక సర్వసభ్య సమావేశం నవంబర్ 17న స్థానిక ఆర్య సమాజ్లో జరిగింది. సమావేశం ప్రారంభంలో సభ్యులందరూ శ్రీ గోనె నరేందర్ రెడ్డి సొసైటికి చేసిన సేవలను స్మరించుకుని నివాళులు అర్పించారు. ఆ తరువాత పదో సర్వసభ్య సమావేశపు వివరాలతో పాటు 2023-2024 ఆర్థిక సంవత్సరం రాబడి, ఖర్చుల పట్టికను సభ్యులకు వివరించి ఆమోదించారు. 2023-2024 ఆర్థిక ఏడాదికి ఆడిటర్లుగా సేవలందించిన గార్లపాటి లక్ష్మారెడ్డి, బండారు శ్రీధర్లకు కృతజ్ణతలు తెలిపారు.
వరుసగా రెండోసారి అధ్యక్షుడిగా నామినేషన్ వేసిన గడప రమేశ్ బాబు, ఆయన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ప్రతిపాదించారు. నామినేషన్ గడువులోగా ఒకే టీమ్ నుంచి నామినేషన్ రావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారి దోర్నాల చంద్ర శేఖర్ ప్రకటించారు. ఈసారి ఎన్నికల అధికారులుగా దోర్నాల చంద్రశేఖర్, సురేష్ మాటేటిలు వ్యవహరించారు. తనకు రెండోసారి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు గడప రమేష్ అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
నూతన కార్యవర్గం సహకారంతో సొసైటీని అభివృద్ధి చేయడానికి మరింత కృషి చేస్తానని టీసీఎస్ఎస్ (తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్) ప్రెసిడెంట్ తెలిపారు. ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తున్న కార్యనిర్వాహక వర్గ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్లుగా కిరణ్ కైలాసపు, తెల్లదేవరపల్లి వెంకట కిషన్ రావులను ఎన్నుకున్నారు.
ఈ సమావేశంలో ముఖ్యమైన మార్పులు : గత 8 ఏళ్లుగా ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించిన బసిక ప్రశాంత్ కుమార్ ఈ సారి ఉపాధ్యక్షులుగా, ప్రాంతీయ కార్యదర్శులుగా సేవలు అందించిన బొందుగుల రాము, నంగునూరు వెంకట రమణలు ప్రధాన కార్యదర్శి, కోశాధికారిగా, కోశాధికారిగా సేవలు అందించిన జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షులుగా సేవలు అందించబోతున్నారు. దీంతో నూతన కార్యవర్గం, కార్యనిర్వాహక వర్గంలో అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి నంగునూరి వెంకట రమణ, సంస్థాగత కార్యదర్శిగా కాసర్ల శ్రీనివాస రావులు వ్యవహరించనున్నారు.