విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 29న ఇంటర్ బోర్డు ముందు తలపెట్టిన మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెజస అధ్యక్షుడు కోదండరామ్ పిలుపునిచ్చారు. పార్టీలన్నీ ఏకమై తమ జెండాలను పక్కన పెట్టి ధర్నాకి పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ఇది ఏ ఒక్కరిచ్చే పిలుపు కాదని.. తెలంగాణ సమాజమే పిలుపునిచ్చినట్లుగా భావించి విద్యార్థుల ప్రాణాలు కాపాడేందుకు కంకణబద్దులు కావాలన్నారు.
హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ఇంటర్ ఫలితాలు - దోషులు- పరిష్కారం అనే అంశంపై విద్యార్థి జన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రొ.నాగేశ్వర్, మాజీ ఎంపీ వివేక్, ప్రొ. విశ్వేశ్వరరావు వివిధ సంఘాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.
ఇంటర్‌లో జరిగిన తప్పిదాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రొ.నాగేశ్వర్ డిమాండ్ చేశారు. 23 మంది విద్యార్థుల ప్రాణాలు పోవటానికి కారణమైన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ ఎంపీ వివేక్ డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: డ్రైవర్ నిర్లక్ష్యం... లారీ కిందపడి ఒకరి దుర్మరణం