హైదరాబాద్ వేదికగా ఫస్ట్ లెగో లీగ్ పేరుతో(ఎఫ్ఎల్ఎల్) రోబో పోటీ జరిగింది. దక్షిణ భారతస్థాయిలో జరిగిన ఈ పోటీల్లో నగరానికి చెందిన 'టెక్నిక్ ఆల్ఫా' జట్టుసభ్యులు జయకేతనం ఎగరవేశారు. నిజజీవితంలో ఎదురయ్యే సవాళ్లకు రోబో సాంకేతికత ద్వారా పరిష్కారం చూపే ఈ పోటీలను 'లెగో', 'ఫస్ట్' కంపెనీలు సంయుక్తంగా నిర్వహించింది.
విజయం సాధించారిలా..
వర్షాకాలంలో హైదరాబాద్ రోడ్లు భారీస్థాయిలో జలమయం అవుతాయి. ఈ కారణంగా రోడ్లపై వందలసంఖ్యలో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతుంది. ఈ నేపథ్యంలో జలమయమైన రోడ్లకు టెక్నిక్ ఆల్ఫా జట్టులోని 9మంది సభ్యులు పరిష్కారాన్ని చూపారు. ఇందులో భాగంగా సెన్సర్లతో కూడిన ఓ హెచ్చరిక బోర్డును ఆయా ప్రాంతాల్లో ఉంచుతారు. బోర్డుకు అమర్చిన సెన్సర్ ఆయా ప్రాంతాల్లో వరద తీవ్రతను లెక్కించి బోర్డులపై చూపుతుంది. ఈ ఏర్పాటు వల్ల వాహనం వెళ్లగలదా లేదా.. అని చోదకుడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనివల్ల వాహనాలు పాడైపోయే ప్రమాదం తప్పుతుందని టెక్నిక్ ఆల్ఫా జట్టు సభ్యులు తెలిపారు. జలమయమైన రోడ్లలో ఉన్న వాహనాల రద్దీని తెలిపేందుకు ఓ యాప్ను కూడా ఈ జట్టు అభివృద్ధి చేసింది. ఈ యాప్ద్వారా వాహనచోదకులు మరో రోడ్డును ఎంచుకునే అవకాశం కలుగుతుంది.
మే నెలలో గ్రీస్ వేదికగా అంతర్జాతీయ పోటీలు
ఈ ప్రయోగాన్ని ప్రదర్శించి లెగో రోబో ప్రదర్శనలో ఛాంపియన్లుగా నిలిచారు టెక్నిక్ ఆల్ఫా సభ్యులు.ఈ ఏడాది జనవరిలో జరిగిన హైదరాబాద్ ప్రాంతీయ స్థాయి పోటీల్లోనూ టెక్నిక్ ఆల్ఫా జట్టు సభ్యులను విజయం వరించింది. మే నెలలో గ్రీస్ వేదికగా జరగనున్న అంతర్జాతీయ స్థాయి పోటీలకు టెక్నిక్ ఆల్ఫా జట్టు ఎంపికైంది. ఈ పోటీల్లో 85 దేశాల నుంచి 140 జట్లు పోటీ పడుతున్నాయి.
ఇవీ చూడండి: పట్టణ ప్రగతిలో అందరూ భాగస్వాములవ్వాలి: సీఎస్