హైదరాబాద్ నగరంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. విభిన్న ఆకృతుల్లో గణపతుల ప్రతిమలు కొలువుదీరి భక్తులను ఆకట్టుకుంటున్నాయి. కాచిగూడలోని చప్పల్ బజార్‌లో ఫ్రెండ్స్ అసోసియషన్ ఆధ్వర్యంలో రోబోటిక్ సెన్సార్ గణేశ్(ROBOTIC SENSOR GANESH) ప్రతిమను ఏర్పాటు చేశారు. వినాయకుడి దర్శనానికి వచ్చే భక్తులకు రోబో గణేశ్ లడ్డునూ ప్రసాదంగా ఇస్తూ భక్తులను తన్మయులను చేస్తున్నాడు.
ఈ రోబోటిక్ సెన్సార్ గణేశ్ ప్రతిమను రాయపూర్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు తయారు చేశారని ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అశ్విన్ తెలిపారు. వినాయకచవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఏడాది విభిన్నంగా గణపతిని ఏర్పాటు చేస్తున్నామని.. అందులో భాగంగా ఈ ఏడాది రోబోటిక్ సెన్సార్‌ను పెట్టినట్లు ఆయన చెప్పారు. ప్రతి రోజు వేయి లడ్డూలను భక్తులకు ప్రసాదంగా గణేశుడు అందిస్తున్నాడని పేర్కొన్నారు. టచ్ చేస్తే లడ్డూ అందిస్తున్న.. గణపతిని చూసేందుకు చిన్నారులతో పాటు పెద్దలు పెద్ద సంఖ్యలో వస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. రోబోటిక్ గణేశ్ తయారీకి రూ. 50 వేలు ఖర్చయినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు నెల రోజుల పాటు శ్రమించి ఈ రోబోను తయారు చేశారని... ఈ విగ్రహాన్ని రైలు ద్వారా నగరానికి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: Minister KTR : 'జూట్ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా ఒప్పందం'