Robberies Increasing in Telangana 2023 : రాష్ట్రంలో ఏటేటా దొంగతనాలు, దోపిడీలు పెరిగిపోతున్నాయి. అయితే రోజుకు సుమారు రూ.అర కోటి చోరులపాలు అవుతుంది అంటే నమ్మగలమా? కానీ నమ్మితీరాల్సిందే అంటున్నారు పోలీసులు. కష్టపడి కూడబెట్టిన సొమ్ము చోరులపాలు కాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త ముఖ్యమని చెబుతున్నారు.
అప్రమత్తంగా లేకుంటే బీరువాలో డబ్బుకే కాదు జేబులో పర్సుకీ, మెడలో గొలుసుకీ, బ్యాంకులో దాచుకున్న సొమ్మకూ గాలం వేసేవారు మనచుట్టూనే ఉన్నారని హెచ్చరిస్తున్నారు. గతేడాదిలో ప్రతిరోజూ చోరులపాలైన సొత్తు విలువ రూ.44.63 లక్షలు. దొంగతనాలతో పాటు అసాంఘిక కార్యకలాపాల నివారణ కోసం పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నా, చోరులు మాత్రం తమ పని తాము చేసుకెళ్తుండటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
Telangana Theft Cases News 2023 : జాతీయ నేర గణాంకాల సంస్థ (NCRB) లెక్కల ప్రకారం, గత ఏడాది (2022) తెలంగాణలో 23,557 దొంగతనాలు, 495 దోపిడీలు, 30 బందిపోటు దొంగతనాలు జరిగాయి. అయితే మొత్తంగా రూ.162.9 కోట్ల విలువైన నగదు, నగలు, సామగ్రి తదితరాలు దొంగలపాలయ్యాయి. రాష్ట్రంలో దొంగలు 2020లో రూ.104.3 కోట్లు, 2021లో 121.6 కోట్ల విలువైన సొత్తు దోచుకున్నారు. ఈ లెక్కన 2020 నుంచి 2022 వరకు రెండేళ్ల వ్యవధిలో చోరుల పాలైన ప్రజల సొత్తు మొత్తం విలువ దాదాపు 60 శాతం వరకు పెరిగింది.
10 లక్షలకు పైగా సీసీ కెమెరాలు బిగించిన తగ్గని నేరాలు : గతంతో పోల్చితే ప్రస్తుతం నేరాల నివారణకు పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. నగరాలు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లు, రహదారులు, వీధుల వెంట ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు బిగిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు సుమారు 10 లక్షలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పదేపదే నేరాలకు పాల్పడేవారిపై పీడీ చట్టం కింద జైళ్లలోనే ఎక్కువ కాలం గడిపేలా చేస్తున్నారు. అయినా గానీ రాష్ట్రంలో దొంగతనాలు తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
బ్యాంకులో భారీ చోరీ- సిబ్బందికి తుపాకీ గురిపెట్టి రూ.19 కోట్లతో పరార్
బాధితులకు ఏదీ న్యాయం? : తెలంగాణలో గత ఏడాది చోరులపాలైన రూ.162.9 కోట్ల విలువైన సొత్తులో రూ.84.9 కోట్లు (అంటే దాదాపు 53 శాతం) మాత్రమే రికవరీ అయింది. అయితే మరో 47 శాతం రికవరీ కావాల్సి ఉంది. చోరులు పోలీసులకు దొరుకుతున్నా తమ సొత్తు మాత్రం రికవరీ కాక న్యాయం దక్కడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పోలీసులు నిఘాను మరింత తీవ్రతరం చేసి చోరీలను అరికట్టాలని ప్రజలు, మరోవైపు దొంగలపాలైన తమ సొత్తు అందేలా చూడాలని బాధితులు పోలీసులను కోరుతున్నారు.
ముందు జాగ్రత్తలే ముఖ్యం : కష్టపడి కూడబెట్టిన సొమ్ము చోరులపాలు కాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తలే ముఖ్యమని పోలీసులు చెబుతున్నారు. ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లేప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, స్థానిక పోలీస్స్టేషన్లో సమాచారం ఇచ్చి వెళ్లాలని సూచిస్తున్నారు. ఇంట్లో ఎక్కువ నగదు, నగలు ఉంచవద్దని పదేపదే హెచ్చరిస్తున్నారు. అయినా సరే పలువురు దీన్ని పాటించడంలేదు. మాయమాటలతో మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. వ్యక్తిగత వివరాలేవీ ఇతరులతో పంచుకోవద్దని పేర్కొంటున్నారు.
షో రూంలో దొంగతనం - లాకర్ బరువుందని చెత్తలో వదిలేసిన దొంగలు
పట్టపగలే ఎంత పనిచేశావయ్యా - బైక్ బ్యాగ్లో నుంచి డబ్బు కాజేసిన దొంగ