నిర్మాణరంగ వలస కార్మికులకు ఉపాధి కల్పించేందుకు న్యాక్ రూపొందించిన ప్రత్యేక వెబ్‌సైట్‌కు అపూర్వ స్పందన లభిస్తోందని రహదార్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. వెబ్సైట్లో ఇప్పటి వరకు వివిధ రంగాల్లో నైపుణ్యం ఉన్న 10వేల 90 మంది కార్మికుల వివరాలు నమోదు చేసుకున్నారని చెప్పారు. కరోనా సంక్షోభంతో గల్ఫ్ దేశాలు, ముంబయి, సూరత్ తదితర ప్రాంతాల నుంచి స్వరాష్ట్రానికి తిరిగి వస్తున్న వలస కార్మికులకు ఉపాధి కల్పించేందుకు న్యాక్ ద్వారా అవసరమైన ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.
వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి స్వరాష్ట్రానికి వచ్చే నిర్మాణ కార్మికులు వారి సమాచారాన్ని tsnac.cgg.gov.in వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్లు ప్రశాంత్ రెడ్డి వివరించారు. రాష్ట్ర నిర్మాణరంగ సంస్థలైన బీఏఐ, క్రెడాయ్, ట్రెడా, టీబీఎఫ్, ఐజీబీసీ ద్వారా ప్రైవేట్ నిర్మాణ సంస్థలకు కార్మికుల వివరాలను అందించామని.. ఆయా సంస్థల అవసరాల మేరకు నమోదు చేసుకున్న కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని తెలిపారు.
నిరుద్యోగ యువత, కార్మికులకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వాలని... ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే వివిధ నిర్మాణ రంగ సంస్థలను ఇంకా పెద్ద ఎత్తున భాగస్వామ్యుల్ని చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. నిరుద్యోగులు, కార్మికులకు వివిధ నిర్మాణ సంస్థల ద్వారా ఉపాధి అవకాశాలు లభించేలా న్యాక్ ఓ వారధిలా పనిచేయాలన్నారు.
ఇవీ చూడండి: కంటోన్మెంట్‌లోనూ ప్రభుత్వ పథకాల అమలు: తలసాని, మల్లారెడ్డి