పోడు భూములను సాగుచేస్తున్న రైతులకు ఆ భూములపై హక్కులు కల్పించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. పోడు భూములు సాగుచేసుకుంటున్న రైతులపై ప్రభుత్వ దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పోడు రైతు పోరాట కమిటీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సదస్సుకు తెజస అధ్యక్షుడు కోదండ రాం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ములుగు ఎమ్మెల్యే సీతక్క, తెదేపా సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర నలుమూలల నుంచి పోడు రైతులు, బాధితులు హాజరయ్యారు.
అడవులను నమ్ముకుని అనేక మంది జీవిస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న వారే అటవీ సంపదను పరిరక్షిస్తున్నారు. పోడు భూముల్లో సాగు చేసుకునేవారికే ఆ భూములపై హక్కులు కల్పించాలి. అర్హతను బట్టి వాళ్లకు పట్టాలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం, ప్రభుత్వాధికారులపై ఉంది. అటవీ భూములకు సంబంధించి 2006లో కేంద్రం తెచ్చిన చట్టంపై రాష్ట్రంలో అమలు చేయాలి. -రావుల చంద్రశేఖర్ రెడ్డి, తెదేపా సీనియర్ నేత
పార్లమెంటులో అటవీ భూములపై చట్టం వచ్చిన తర్వాత కూడా.. పోడు రైతులకు భూ హక్కులు కల్పించడానికి ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందో అర్థం కావడం లేదు. చట్టబద్ధమైన హక్కుల కోసం సాయుధ పోరాటాలు జరిగిన రోజులున్నాయి. రాష్ట్రంలో పోడు భూములను రక్షించుకోవడం కోసం ఎంతకైనా పోరాడాల్సి ఉంది. పోడు భూములు కాజేస్తే వాటిని నమ్ముకుని ఉన్న ప్రజల గోడు ప్రపంచానికి తెలియాలంటే గొంతు వినిపించాల్సి ఉంటుంది. -తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
అఖిల పక్ష నిర్ణయానికి మా మద్దతు సంపూర్ణంగా ఉంటుంది. పోడు భూములు సాగుచేసుకుంటున్న రైతులకే భూ హక్కులు దక్కుతాయి. అందుకు మద్దతుగా జరిగే సదస్సుల్లో పోడు రైతులకు అఖిల పక్షం అండగా ఉంటుంది. పోరాటాల ద్వారా మాత్రమే కబ్జాకు గురైన భూములను ప్రజలకు దక్కేలా చేశాం. ఏ భూములైనా సరే సీఎం కేసీఆర్ పాలనలో కొందరికి మాత్రమే దక్కుతున్నాయి. కొన్ని భూములను కార్పొరేట్ల పరం చేస్తున్నారు. పోడు భూముల విషయంలో అటవీ శాఖ అధికారులు రైతులకు అన్యాయం చేస్తున్నారు. -సీతక్క, ములుగు ఎమ్మెల్యే
అటవీ ప్రాంత ప్రజలు మాత్రమే అడవులను కాపాడుతున్నారని.. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని నేతలు అన్నారు. పోడు భూముల విషయంపై గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని నాయకులు అభిప్రాయపడ్డారు. పేదలకు పంచిన భూములు మళ్లీ కార్పొరేట్ కంపెనీలు లాక్కుంటున్నాయని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అక్టోబర్ 5న పోడు భూములు ఉన్న ప్రాంతాల్లోని 400 కిలోమీటర్ల రోడ్లపై ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రహదారి దిగ్బంధం చేయాలని అఖిలపక్ష నేతలు సూచించారు.
ఇదీ చదవండి: CM KCR REVIEW: దళితబంధు అమలుపై కేసీఆర్ సమీక్ష... సీఎల్పీ నేత భట్టి హాజరు