కరోనా ప్రభావం... లాక్‌డౌన్ అమలు... రాత్రివేళల్లో కర్ఫ్యూ కారణంగా వాహనాల రాకపోకలు 70శాతానికిపైగా తగ్గిపోవడం వల్ల ప్రమాదాల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న ప్రమాదాల్లో 35శాతం ప్రమాదాలు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషరేట్ల నుంచే నమోదవుతున్నాయి. వీటిని తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులు రెండుమూడేళ్ల నుంచి తీవ్రంగా కృషి చేస్తుండడం వల్ల ప్రమాదాలు, మరణాలు కొంతమేరకు తగ్గుతున్నాయి.
మార్చి 23 నుంచి లాక్‌డౌన్ ప్రారంభమయ్యాక ఒక్కసారిగా ప్రమాదాల రేటు పడిపోయింది. మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధుల్లో రోజుకు సగటున 20 ప్రమాదాలు నమోదవుతుండగా.. ఏప్రిల్‌లో కేవలం 8 నమోదయ్యాయి.. లాక్‌డౌన్ అమలవుతున్నా కొన్ని ప్రాంతాల్లో ప్రమాదాలు జరుగుతుండటంతో స్పందించిన పోలీస్ ఉన్నతాధికారులు ఆయా ప్రాంతాల్లో గస్తీ బృందాలను పెంచారు. అనూహ్యంగా ఎలాంటి ఘటనలు చోటుచేసుకున్నా కంట్రోల్‌రూంకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.
మరణాలు కనిష్ఠం..
లాక్‌డౌన్ ప్రభావంతో ఏప్రిల్‌లో మరణాలు చాలా తగ్గిపోయాయి. రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మరణించారు. వాహనాల రాకపోకలపై నియంత్రణలు, రాత్రి వేళ కర్ఫ్యూ అమల్లో ఉంది. దీంతో పాటు నగరంలోని 113 ప్రాంతాల్లో పోలీసులు చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి వాహనాల తనిఖీలు చేస్తుండడం వల్ల పోలీసులున్నారన్న భయంతో వాహన చోదకులు బయటకు రాకుండా ఇళ్లకే పరిమితమయ్యారు.
ఏప్రిల్‌లో జరిగిన ప్రమాదాలను పోలీసు ఉన్నతాధికారులు విశ్లేషించారు. హైదరాబాద్‌లో రోజుకు సగటున 1.6 ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయని, సాధారణ రోజుల్లో రోజుకు 7 నుంచి 10 వరకు ప్రమాదాలు జరిగేవని గుర్తించారు. మార్చి చివరి వారంలో లాక్‌డౌన్ ప్రారంభమయ్యాక క్రమంగా ప్రమాదాలు తగ్గుతూ వచ్చాయని తెలుసుకున్నారు. ప్రమాదాలు నమోదైన ప్రాంతాల్లో అవి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సూచికల బోర్డులు, రోడ్ల మరమ్మతులు చేపట్టారు.