గోదావరి నీటిని రెండు పథకాల ద్వారా కృష్ణాకు మళ్లించడంపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని తెలుగు రాష్ట్రాల ఇంజినీర్లు నిర్ణయించారు. హైదరాబాద్ జలసౌధలో ఏపీ, తెలంగాణ ఉన్నత స్థాయి ఇంజినీర్లు మంగళవారం సమావేశం నిర్వహించారు. తెలంగాణలో రాంపూర్ నుంచి శ్రీశైలంకు, ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం నుంచి నాగార్జునసాగర్‌కు నీటిని మళ్లించే పథకాలకు సంబంధించి చర్చించారు. మొత్తం కాలువ పొడవు, సొరంగ మార్గం, నిర్మాణం కోసం సేకరించాల్సిన భూమి, అంచనా వ్యయం ఇలా అన్నింటిపై సమగ్రంగా అధ్యయనం చేయాలన్నారు.
ఈ నెల 13 లేదా 15న మళ్లీ సమావేశం
గరిష్ఠంగా 400 టీఎంసీలు, కనిష్ఠంగా 300 టీఎంసీలు కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు మళ్లించాల్సిన అవసరం ఉందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. రెండు పథకాలపై అధ్యయనం చేసిన తర్వాత ఈ నెల 13 లేదా 15 తేదీల్లో మళ్లీ సమావేశమవ్వాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రుల భేటీ నాటికి పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో రెండు రాష్ట్రాల అవసరాలు, గోదావరి నుంచి ఎంత నీటిని ఎక్కడి నుంచి మళ్లించాలనే విషయంపై చర్చించారు. దీనివల్ల బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట ఎదురయ్యే న్యాయ సమస్యలు, ప్రతిపాదిత పథకాల సర్వే నిర్మాణం, నిర్మాణ, నిర్వహణ వ్యయాన్ని పంచుకోవడం, ఎగువ రాష్ట్రాలు వాటా కోరే అంశం, కేంద్రం తలపెట్టిన గోదావరి-కావేరి అనుసంధానం తదితర అంశాలను అజెండాలో చేర్చారు.
నీటిని మళ్లించే ప్రతిపాదనల గురించి వివరణ
మొదట ఆంధ్రప్రదేశ్ ఇంజినీర్లు పోలవరం నుంచి నాగార్జున సాగర్ ద్వారా శ్రీశైలంకు, దుమ్ముగూడెం నుంచి నాగార్జున సాగర్‌కు, తుపాకుల గూడెం నుంచి వైకుంఠపురం రిజర్వాయర్ ద్వారా పులిచింతల, నాగార్జునసాగర్‌కు నీటిని మళ్లించే ప్రతిపాదనల గురించి వివరించారు. తెలంగాణ ఇంజినీర్లు రాంపూర్ నుంచి శ్రీశైలానికి, పోలవరం నుంచి వైకుంఠపురం రిజర్వాయర్ ద్వారా పులించింతల, నాగార్జునసాగర్‌కు నీటిని మళ్లించే ప్రతిపాదనల గురించి చర్చించారు.
నీటి మళ్లింపు పథకం పట్ల తెలంగాణ ఇంజినీర్ల విముఖత
దుమ్ముగూడెం నుంచి నాగార్జునసాగర్ టేల్‌పాండ్‌కు నీటిని మళ్లించే పథకం పట్ల తెలంగాణ ఇంజినీర్లు విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. రాంపూర్ వద్ద బ్యారేజి నిర్మిస్తే తుపాకులగూడెం ముంపునకు గురవుతందని... తుపాకులగూడెం నుంచి నీటిని మళ్లించేలా చేపడితే మంచిదని ఏపీ ఇంజినీర్లు చేసిన సూచనతో తెలంగాణ ఇంజినీర్లు ఏకీభవించలేదు. పోలవరం కాలువను వెడల్పు చేసి వైకుంఠపురం ద్వారా నీటిని మళ్లించొచ్చన్న తెలంగాణ ఇంజినీర్ల ప్రతిపాదనకు అంధ్రప్రదేశ్ ఇంజినీర్లు అంగీకరించలేదని సమాచారం.
ఇవీ చూడండి : సుప్రీంలో 'పోలవరం'.. 4 వారాలకు విచారణ వాయిదా