కరోనా వైరస్ విద్యా వ్వవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కొన్ని పదో తరగతి పరీక్షలు సైతం వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ తరుణంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి పదో తరగతి విద్యార్థులకు పునఃశ్చరణ తరగతులు నిర్వహించనున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. దూరదర్శన్ యాదగిరి ఛానెల్ ద్వారా పునఃశ్ఛరణ తరగతులు నిర్వహించనున్నట్టు తెలిపారు.
రేపటి నుంచి ఉ.10 గంటల నుంచి 11 గంటల వరకు... ఆ తర్వాత తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు పునఃశ్చరణ తరగతులు ఉంటాయని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆంగ్లం, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులపై బోధన ఉంటుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని పదో తరగతి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులకు అవగాహన కల్పించాలని చెప్పారు.