వినాయక నిమజ్జనానికి సంబంధించిన తీర్పుపై హైకోర్టులో జీహెచ్‌ఎంసీ(ghmc) రివ్యూ పిటిషన్(review petition) దాఖలు చేసింది. తీర్పులో ప్రధానంగా నాలుగు అంశాలను సవరించాలని కోరింది. హుస్సేన్‌సాగర్, ఇతర జలాశయాల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్(POP) విగ్రహాల నిమజ్జనంపై నిషేధం ఎత్తివేయాలని కోరింది. ట్యాంక్ బండ్ వైపు నిమజ్జనం చేయరాదన్న ఆంక్షలు తొలగించాలని విజ్ఞప్తి చేసింది. మినహాయింపులు ఇవ్వకపోతే గందరగోళం తలెత్తి... భాగ్యనగరం స్తంభించే ప్రమాదం ఉందని జీహెచ్‌ఎంసీ ప్రస్తావించింది. రివ్యూ పిటిషన్‌పై లంచ్ మోషన్ విచారణకు అంగీకరించిన ధర్మాసనం.. మధ్యాహ్నం రెండున్నర తర్వాత విచారణ చేపట్టనుంది.
సడలింపుల కోసం విజ్ఞప్తి
హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనంపై ఈ నెల 9న ఇచ్చిన తీర్పును పున:సమీక్షించి సవరించాలని హైకోర్టును జీహెచ్‌ఎంసీ విజ్ఞప్తి చేసింది. హైకోర్టు తీర్పులో ప్రధానంగా నాలుగు అంశాలపై నిషేధం ఎత్తివేసి సడలింపులు ఇవ్వాలని కోరుతూ జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. హుస్సేన్‌సాగర్, ఇతర జలాశయాల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్(POP) విగ్రహాల నిమజ్జనంపై నిషేధం తొలగించాలని విన్నవించారు. జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక నీటికుంటల్లోనే వాటిని నిమజ్జనం చేయాలన్న ఆదేశాలను సవరించాలని కోరారు. ఇప్పటికే వేల సంఖ్యలో భారీ పీవోపీ విగ్రహాలు మండపాల్లో ఉన్నాయని రివ్యూ పిటిషన్‌లో హైకోర్టుకు వివరించారు. నగరంలోని పీవోపీ విగ్రహాలకు తగినన్ని సంఖ్యలో ప్రత్యేక నీటి కుంటలు లేవని పేర్కొంది. కుంటల లోతు చాలా తక్కువగా ఉంటుందని... వాటిలో ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలు నిమజ్జనం చేయడం కష్టమని తెలిపింది. వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక కుంటలకు విగ్రహాలకు తరలించడం అంత సులువు కాదని జీహెచ్‌ఎంసీ కమిషనర్ పిటిషన్‌లో ప్రస్తావించారు.
ఆంక్షలు ఎత్తివేయాలి
ట్యాంక్‌బండ్ వైపు నుంచి నిమజ్జనం చేయరాదన్న ఆంక్షలను ఎత్తివేయాలని ధర్మాసనాన్ని జీహెచ్‌ఎంసీ కోరింది. పీవీ మార్గ్(PV marg), ఎన్టీఆర్(NTR) గార్డెన్, సంజీవయ్య పార్కు(Sanjeevaiah Park) మార్గాల్లోనూ కృత్రిమ రంగులు లేని విగ్రహాలనే నిమజ్జనానికి అనుమతించాలని ఉత్తర్వులను సవరించాలని విజ్ఞప్తి చేసింది. ట్యాంక్ బండ్‌వైపే హుస్సేన్‌సాగర్(hussain sagar) ఎక్కువ లోతు ఉంటుందని జీహెచ్‌ఎంసీ తెలిపింది. ఇప్పటికే అక్కడ అధునాతన క్రేన్లు, వేదికలు ఏర్పాటు చేశామని వివరించింది. ట్యాంక్‌బండ్ వైపు అనుమతించకపోతే.. నిమజ్జనం పూర్తయ్యేందుకు కనీసం ఆరు రోజులు పడుతుందని తెలిపింది. కృత్రిమ రంగులతో కూడిన వినాయక విగ్రహాలు వేల సంఖ్యలో ఉన్నందున.. ప్రత్యామ్నాయం కష్టమని తెలిపింది.హుస్సేన్‌సాగర్ ప్రత్యేక రబ్బరు డ్యాంను ఏర్పాటు చేయాలన్న ఉత్తర్వులను సవరించాలని విన్నవించింది. ఈ నెల 20 నాటికి రబ్బరు డ్యాం నిర్మించడం కష్టమని తెలిపింది. రబ్బరు డ్యాం నిర్మాణానికి భారీగా నిధులు, సిబ్బంది అవసరమని.. అది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని పేర్కొంది.
నగరం స్తంభించే ప్రమాదం
హుస్సేన్‌సాగర్‌లో కొన్ని దశాబ్దాలుగా వినాయక నిమజ్జనం జరుగుతోందని జీహెచ్‌ఎంసీ హైకోర్టుకు నివేదించింది. కొన్ని నెలల క్రితమే ప్రణాళికలు సిద్ధమయ్యాయని.. ఇప్పటికిప్పుడు వాటిని మార్చడం కష్టమని తెలిపింది. విగ్రహాలకు తరలించే మార్గాలు, ఇతర ప్రణాళికలను అకస్మాత్తుగా మారిస్తే గందరగోళం నెలకొని తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వివరించింది. విగ్రహాలను అడ్డుకుంటే రోడ్లపై వాహనాలు వదిలిపెట్టి వెళ్లాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నేతలు కొందరు పిలుపునిచ్చారని ప్రస్తావించింది. రోడ్లపై వాహనాలు వదిలేస్తే వాటిని తరలించడానికి సమయం పడుతుందని.. నగరమంతా దిగ్భంధమై స్తంభించే ప్రమాదం ఉందని హైకోర్టు దృష్టికి తెచ్చింది. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన చర్యలు తీసుకుంటామని.. నిమజ్జనం ముగిసిన 24 గంటల్లో వ్యర్థాలను తొలగిస్తామని హామీ ఇచ్చింది. కొవిడ్(covid) పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రజలు మాస్కులు ధరించేలా చైతన్యం కలిగించేలా చర్యలు తీసుకుంటామనని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌లో వివరించారు.
మధ్యాహ్నం విచారణ
జీహెచ్‌ఎంసీ రివ్యూ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ జరపాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హరీందర్ కోరారు. భోజన విరామ సమయంలో విచారణ జరపాలని విజ్ఞప్తి చేయగా.. లంచ్ మోషన్‌కు అంగీకరించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ MS.రామచంద్రరావు, జస్టిస్ టి.వినోద్ కుమార్ ధర్మాసనం మధ్యాహ్నం రెండున్నర గంటలకు విచారణ జరపనుంది.
ఇదీ చదవండి: Ganesh Immersion: నిమజ్జనంపై హైకోర్టు ఆదేశాలు.. తలలు పట్టుకున్న అధికారులు