రాష్ట్రంలో తమపై సామాజిక మాధ్యమాల్లో సాగుతున్న విద్వేషపూరిత ప్రచారాన్ని తక్షణమే నియంత్రించాలని పోలీసు శాఖకు రెవెన్యూ ఐకాస విజ్ఞప్తి చేసింది. రెచ్చగొట్టే ప్రచారాలు చేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. తెలంగాణ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి నేతృత్వంలో రెవెన్యూ ఐకాస నేతల బృందం హైదరాబాద్‌లో అదనపు డీజీపీ జితేందర్‌ను కలిసింది. ఇటీవల రెవెన్యూ ఉద్యోగులకు వ్యతిరేకంగా కొందరు పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అదనపు డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు.
పోలీస్ బందోబస్తు పెట్టండి...
తహసీల్దార్ విజయారెడ్డి హత్య ఘటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగుల్లో భయాందోళనలు నెలకొన్న దృష్ట్యా... అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో తగినంత పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు. భవిష్యత్‌లో ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని విన్నవించారు. హత్య ఘటనపై సమగ్ర విచారణ జరిపించి నిందితుడి వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
దారుణాలు పునరావృతమయ్యే ప్రమాదముంది...
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంలోనూ నేతలు వినతిపత్రం అందజేశారు. సామాజిక మాద్యమాల్లో విద్వేషపూరిత ప్రచారంపై కఠిన చర్యలు తీసుకోవాలని... లేనిపక్షంలో తహసీల్దార్ విజయారెడ్డి హత్య వంటి దారుణ ఘటనలు పునరావృతం అయ్యో ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారించి వేగంగా న్యాయం జరిగేలా చూడాలని కోరినట్లు తెలంగాణ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లచ్చిరెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి: 'ధిక్కరణ చర్యలు చేపట్టే అధికారం మాకు ఉంది'