ఎంఎంటీఎస్ రైల్వే లైను సికింద్రాబాద్ నుంచి మేడ్చల్‌కు మంజూరు చేయాలని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కోరారు. రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో జూమ్ యాప్ ద్వారా జరిగిన సమావేశంలో పాల్గొన్న ఎంపీ రేవంత్‌రెడ్డి.. తన నియోజక వర్గంలో పలు రైల్వే అంశాలను ప్రస్తావించారు. ఉమ్‌దానగర్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎంఎంటీఎస్ రైల్వే లైన్‌ను పొడిగించాలని కోరారు. ఇక్కడ నుంచి ఎయిర్ పోర్టుకు కేవలం 5.5 కిలోమీటర్లని... దానిని పూర్తి చేసినట్లయితే విమాన ప్రయాణీకులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించినట్లవుతుందని పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో త్వరగా తమ గమ్య స్థానాలకు చేరుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని తెలిపారు.
అల్వాల్, మల్కాజిగిరి, బొల్లారం రైల్వే స్టేషన్లల్లో మౌళిక వసతులు లేవని.. వాటిని కూరగాయల విక్రయదారులు ఆక్రమించుకున్నారని...ప్రయాణీకులు రాకపోకలు సాగించాలంటే ఇబ్బంది పడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆ మూడు రైల్వే స్టేషన్లలో మౌళిక వసతులు కల్పించి ఆధునికీకరించాల్సి ఉందన్నారు. అదే విధంగా బొల్లారం, వాజ్‌పేయి నగర్, గుండ్ల పోచంపల్లి అండర్ గ్రౌండ్ బిడ్జి, మియాపూర్-మేడ్చల్ చెక్‌పోస్టు ఆయోధ్య చౌరస్తా, గౌడవల్లి రైల్వే స్టేషన్ బ్రిడ్జి, మేడ్చల్ రైల్వే స్టేషన్ బ్రిడ్జి, దబీర్‌పుర రైల్వేస్టేషన్ బ్రిడ్జి తదితర ప్రాంతాల్లో రైల్వే అండర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మచ్చబొల్లారం, టాకీస్ రోడ్డు ప్రాంతాల్లో రైల్వే అండర్ బ్రిడ్జిలను విస్తరించాల్సి ఉందన్నారు. ఆనంద్ బాగ్, తుకారాంగేట్ రైల్వే అండర్ బ్రిడ్జిలు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఇలా 24 అంశాలను రైల్వే శాఖ మంత్రి పీయూష్‌గోయల్ దృష్టికి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు.
ఇవీ చూడండి: 'వ్యవసాయ బిల్లులతో రైతుల అస్థిత్వానికి ప్రమాదం'