గత కొన్ని రోజులుగా దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని తెరాస మంత్రులు చేస్తున్న విమర్శలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. కృష్ణానది జలాలను అడ్డుపెట్టుకుని వై.ఎస్.ను విమర్శించడంలో అర్థం లేదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే వై.ఎస్.పై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. మల్కాజిగిరి పార్లమెంట్ క్యాంపు కార్యాలయంలో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన.. అనేక అంశాలను ప్రస్తావించారు.
ఎప్పుడో చనిపోయిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన పని ఏముందిని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేవలం కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చడం కోసమే వైఎస్‌ను విమర్శిస్తున్నారని ఆరోపించారు. సంస్థాగతంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందన్న రేవంత్.. రాష్ట్రంలో భాజపా ప్రభావం తక్కువేనని వ్యాఖ్యానించారు.
వచ్చే నెల ఏడో తేదీన మధ్యాహ్నం 1.30 గంటలకు పీసీసీ బాధ్యతలు తీసుకుంటానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాను నిరుద్యోగ సమస్య పరిష్కారంపై దృష్టి సారిస్తానని అన్నారు. రైతులకు సంబంధించి తమ వద్ద అద్భుతమైన ప్రణాళిక ఉందని, పార్టీ ఆమోదం తర్వాత దానిని వెల్లడిస్తానని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో భూమిలేని నిరుపేదలకు ప్రయోజనం కలిగించే పథకాలు ఏమీ లేవని విమర్శించారు. కేసీఆర్ తెచ్చిన ప్రతి పథకం ఉన్న వాళ్లకే ఉపయోగకరంగా ఉందని ధ్వజమెత్తారు.
ఈ సందర్భంగా ఈటల పార్టీ మార్పుపై స్పందించిన రేవంత్.. ఈటల వ్యవహారం మతి లేనోడు పోయి.. గతిలేనోడి కాళ్లు పట్టుకున్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు.
ఇదీ చూడండి: TPCC: రేవంత్ హస్తానికి పగ్గాలు... పార్టీలో కొత్త ఆశలు