Revanth reddy on agnipath scheme : తెలంగాణలో జరుగుతున్న భూ హత్యలకు ధరణి పోర్టల్‌నే కారణమని.. తాము అధికారంలోకి వస్తే.. ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు. సోమవారం ఖమ్మం జిల్లా మాజీ కార్పొరేటర్ రామమూర్తి నాయక్, మాజీ జడ్పీటీసీ భారతిల ఆధ్వర్యంలో దాదాపు వెయ్యి మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
రైతులకు అన్యాయం జరిగితే తిరగబడ్డ ప్రాంతం ఖమ్మమన్న రేవంత్ రెడ్డి... మిర్చి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలేదని నిలదీస్తే క్రిమినల్ కేసులు పెట్టి బేడీలు వేసి రైతులను ఆరెస్టు చేశారని ఆరోపించారు. 22 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా.... ఆ రైతు కుటుంబాలను ఇప్పటికీ పరామర్శించిన పాపాన పోలేదని మండిపడ్డారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌పై పోరాటం చేస్తున్న వారిపై పోలీసు కేసులు పెట్టారని ధ్వజమెత్తారు.
దేశవ్యాప్తంగా సత్యాగ్రహ దీక్ష చేపట్టాం. జవాన్ల నియామకాలు యధావిధిగా చేపట్టాలి. విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు తొలగించాలి. అగ్నిపథ్ విషయంలో విద్యార్థుల పోరాటానికి అండగా నిలవాలి. అగ్నిపథ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి తెలపాలి. అగ్నిపథ్ విధానంపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయాలి. అగ్నిపథ్ విధానాన్ని తిరస్కరిస్తున్నట్లు అసెంబ్లీలో తీర్మానం చేయాలి. రాష్ట్రంలో మోదీ పర్యటనపై తెరాస వైఖరిని ప్రజలకు చెప్పాలి. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన పోరాటానికి సిద్ధం. -రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోటని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ శాసనసభ మీద కాంగ్రెస్ జెండా ఎగురవేసినప్పుడే రైతులకు న్యాయం జరుగుతుందని ఆరోపించారు. వరంగల్ డిక్లరేషన్ ద్వారా రైతులు పంటరుణం తీసుకుంటే... ఏకంగా రెండు లక్షల రూపాయిల వరకు మాఫీ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. విద్యార్ధులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్ లేదని.... కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ పథకాన్ని పటిష్ఠంగా అమలు చేస్తామని తెలిపారు. ఆర్మీలో నియామకాలు చేపట్టకుండా... రాత పరీక్షలు రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాని స్థానంలో నాలుగేళ్ల ఔట్ సోర్సింగ్ విధానాన్ని తీసుకొచ్చారన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కేసులో నిరసన కారులపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి:
చేతులెత్తి మొక్కుతున్నా.. రాజకీయం చేయకుండ్రి: ఎర్రబెల్లి
రెచ్చిపోయిన దొంగలు.. గన్స్‌తో వచ్చి చోరీ.. అడ్డొచ్చిన యజమాని హత్య