Revanth Reddy letter: ముఖమంత్రి కేసీఆర్కు టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో అకాల, భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు వెంటనే పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మిర్చి రైతులకు ఎకరాకు రూ. 50 వేల పరిహారం ఇవ్వాలని.. మిగతా పంటలకు ఎకరాకు రూ. 25 వేలు చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో తామర తెగులు, భారీ వర్షాలతో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారని.. మిర్చి పంట మంచిగా పండితే ఎకరాకు 3.50 లక్షల ఆదాయం వస్తోందని ఆశపడి ఎకరాకు లక్షన్నర పెట్టుబడి పెట్టారన్నారు.
కేసీఆర్కు తీరిక లేదా..?
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తానని చెప్పిన సీఎం కేసీఆర్.. తర్వాత తప్పించుకుని మంత్రులను, అధికారులను పంపించారని విమర్శించారు. రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల్లో ప్రకృతి వైపరీత్యాలతో దాదాపు రూ.8వేల 633కోట్ల నష్టం వచ్చిందని తెలిపారు. కేంద్రం ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చిన నిధులను ఏం చేశారని ప్రశ్నించారు. వెంటనే రైతులను ఆదుకోకపోతే కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతుల కోసం ప్రత్యక్ష కార్యాచరణ చేపడతామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: