Revanth Reddy Comments On Governor: గవర్నర్ అచ్చం రాజకీయ నాయకురాలుగా మారారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. విభజన చట్టం సెక్షన్ 8 ప్రకారం గవర్నర్‌కు చాలా అధికాారాలున్నాయని వాటి ప్రకారం.. అందరూ అధికారులను ఆమె పిలిచి మాట్లాడవచ్చని తెలిపారు. సమీక్ష చేసి సస్పెండ్ చేసే అధికారం ఉంటుందన్నారు. డీవోపీటీకి సిఫారసు చేస్తే చాలు.. సీఎస్ మీద అయినా చర్యలు తీసుకోవచ్చని వివరించారు. గవర్నర్ మొన్ననే అసెంబ్లీలో ఎవరూ పొగడనంత ఎక్కువ పొగిడారని గుర్తుచేశారు.
ఈనెల 9న కరీంనగర్లో బహిరంగ సభ నిర్వహిస్తామని, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ సీఎంలను ఆహ్వానిస్తున్నామని రేవంత్ తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలను కరీంనగర్ సభకు ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. కేసీఆర్ పని అయిపోయిందన్న రేవంత్.. అందుకే బై బై కేసీఆర్ స్లోగన్ తీసుకున్నామన్నారు. 150 రోజులలో 100 నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తి చేస్తానని పేర్కొన్నారు.
ప్రజలతో మమేకమవుతూ సమస్యలను తెలుసుకుంటున్న రేవంత్: వచ్చే పది సంవత్సరాలు కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని రేవంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుంటేనే సంక్షేమ ఫలాలు పేదలందరికీ అందుతాయని రేవంత్‌రెడ్డి అన్నారు. హాథ్ సే హాథ్ జూడో యాత్రలో భాగంగా కరీంనగర్ జిల్లా మొగిలిపాలెంలో ఆయన పాదయాత్రను ప్రారంభించారు. గ్రామాల్లో కాలినడకన తిరుగుతూ ప్రజలతో మమేకమవుతూ సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.
మల్లాపూర్‌లో మహిళలతో మాట్లాడిన రేవంత్‌రెడ్డి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మీ సమస్యలు తెలుసుకోవడానికి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మీ వద్దకు రావడం లేదా అని ఆయన ప్రజలను ప్రశ్నించారు. గెలిచిన తరువాత ఎమ్మెల్యే రసమయి గ్రామాల్లోకి రావడమే లేదని వారు సమాధానం చెప్పారు. దీంతో తమ సమస్యలు వినే వారు లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. చిరు వ్యాపారులకు బ్యాంకు నుంచి రావాల్సిన రుణాలు రావడం లేదని ఈ సందర్భంగా పలువురు మహిళలు వాపోయారు.
మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన రుణాలు ఇవ్వడం లేదు: మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన రుణాలు కూడా ఇవ్వడం లేదని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తనకు పెన్షన్ ఇవ్వడం లేదని మధురమ్మ అనే వృద్ధురాలు వాపోయింది. ఈసారి మహిళా శక్తిని చాటి ప్రభుత్వానికి బుద్ది చెబుతామన్న మహిళలు.. తమ బిడ్డలను పీజీలు చదివించినా ఉద్యోగాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. వారి మాటాలకి స్పందించిన రేవంత్.. కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని హామీ ఇచ్చారు..
హిమాచల్‌ప్రదేశ్ తరహాలో తెలంగాణలో కూడా పూర్తి స్థాయి మెజారీటీతో అధికారంలోకి రాబోతున్నామని రేవంత్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న రేవంత్‌రెడ్డి.. క్షేత్రస్థాయిలో అన్ని వర్గాలను కలుసుకుని సాధక బాధకాలు అడిగి తెలుసుకుంటున్నారు. 19 రోజులుగా 16 శాసనసభ నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు రేవంత్ పాదయాత్ర కొనసాగించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ స్థానిక సమస్యలు ఎత్తిచూపుతూ ముందుకు వెళ్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.2 లక్షలు రుణమాఫీ, బలహీన వర్గాల కుటుంబాల ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు, ఇతర పలు అంశాలపై హామీలు ఇస్తూ ఆకట్టుకుంటున్నారు. కాంగ్రెస్‌లో నేతల మధ్య నెలకొన్న చిన్నచిన్న పొరపొచ్చాలు పార్టీపై ఏ విధమైన ప్రభావం చూపబోవని, త్వరలోనే అవి సమసిపోతాయని అంటున్నారు.
ఇవీ చదవండి: