Revanth reddy: రాష్ట్ర రాజకీయాల్లో రోజుకో వీధి బాగోతం నడుస్తోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల్లో రాణించిన నటులను భాజపా రప్పిస్తోందన్న రేవంత్.. కాంగ్రెస్ ప్రజల ప్రయోజనానికే ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో సీఎం చీలిక తెచ్చారని రేవంత్ విమర్శించారు. చెరో వర్గాన్ని మచ్చిక చేసుకుందామని తెరాస, భాజపా కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. సంజయ్ పార్టీ కార్యాలయంలో రాత్రి నిద్ర చేస్తే తెరాసకు ఇబ్బందేమిటని రేవంత్ ప్రశ్నించారు. 24 గంటల్లో ముగిసిన తతంగాన్ని 10 రోజులుగా సాగదీస్తున్నారని.. బండి సంజయ్ ఏం సాధించారని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తున్నారని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
ఆ జీవో తక్షణమే స్టే ఇవ్వండి..
‘‘రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు చేస్తోంది. రాష్ట్రం పంపిన దస్త్రాన్ని రాష్ట్రపతి ఆమోదించారు. 317 జీవోలో తప్పు ఉందంటే.. దాన్ని ఆమోదించింది ఎవరు? తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆమోదించింది? ఇవాళ 317 జీవోను అమలు చేసి సీఎం కేసీఆర్ తప్పు చేస్తున్నారంటే.. ఆ తప్పుకు కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత. భాజపా ప్రోత్సాహం వల్లే సీఎం కేసీఆర్ జీవోను అమలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. 317 జీవోలో తప్పులున్నాయని గుర్తించి సవరించాలనుకుంటే కేంద్ర ప్రభుత్వానికి అది కష్టమైన పని కాదు. ఈ జీవో ద్వారా తెలంగాణలో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు నష్టం జరుగుతుంది.. ఈ జీవోపై తక్షణమే స్టే ఇవ్వండి.. అని రాష్ట్రానికి చెందిన భాజపా ఎంపీలు కేంద్ర హోంశాఖ మంత్రికి ఫిర్యాదు చేయాలి. అలా ఎందుకు చేయలేకపోతున్నారు.
-రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్
స్థానికత ఆధారంగా చేయాలి..
రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఆరు జోన్ల ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించిందని.. దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం 317 జీవోను తెచ్చిందని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆ జీవో రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని ఆయన అన్నారు. సీనియారిటీ ప్రాతిపదికన కాకుండా స్థానికత ఆధారంగా బదిలీలు చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. తప్పుడు జోన్ల ప్రతిపాదనలను కేంద్రం ఎందుకు ఆమోదించిందని ఈ సందర్భంగా రేవంత్ ప్రశ్నించారు. కేసీఆర్ తప్పును ప్రోత్సహించిందే భాజపా అని ఆయన ఆరోపించారు.
ఎలా ఆమోదించారు..
జోనల్ విధానానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాల్సి ఉంటుంది. జీవోలో ఎలాంటి మార్పులు చేయాలన్నా కేంద్ర మంత్రివర్గ ఆమోదం కావాలి. కేంద్రంలో ఉన్నది భాజపా ప్రభుత్వం. రాష్ట్రానికి చెందిన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. కేసీఆర్ పంపిన ప్రతిపాదనలను ఎలా ఆమోదించారు. ఇదంతా చేసిన భాజపా ప్రభుత్వం ఇప్పుడేమో 317 జీవోను సవరించాలని పోరాటాలు చేస్తున్నామంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. మీరు పోరాటాలు చేయాల్సిన పని లేదు. మీ చేతిలో అధికారం ఉంది. ఒక్క ఫిర్యాదుతో జీవోలో మార్పులు తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకొనేందుకు అవకాశం ఉంది. అధికారం చేతిలో ఉన్నప్పుడే రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ఏం చేస్తారు? ఇది ముమ్మాటికీ ప్రజలను మభ్యపెట్టడమే అవుతుంది.
-రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్
ఇదీ చదవండి: