విద్యార్థులు, నిరుద్యోగులపై ఆంక్షలు, నిర్బంధాలు ఎన్నాళ్లని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ సమాజాన్ని దోచుకునేందుకు ప్రజలను అణచివేస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ అమరవీరుల రుణం ఎప్పటికీ తీరనిదన్నారు. నియంతలను తరిమికొట్టిన గడ్డ తెలంగాణ అని రేవంత్ పేర్కొన్నారు. ఎంతో మందికి పాఠాలు, గుణపాఠాలు నేర్పిన చరిత్ర తెలంగాణదని అన్నారు.
తెలంగాణ ప్రజానీకం ఇంకెంతో కాలం కేసీఆర్ చేతిలో బందీగా ఉండదన్నారు. శ్రీకాంత్ చారికి నివాళి అర్పిస్తామంటే అడ్డుకుంటారా? అంటూ ప్రశ్నించారు. శ్రీకాంత్ చారిని స్మరించుకోవడాన్ని నిషేధించారా అని రేవంత్ మండిపడ్డారు. కేసీఆర్ వైఖరిని ఖండిస్తూ రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలపాలని కాంగ్రెస్ కార్యకర్తలకు, నేతలకు సూచించారు. ప్రజల స్ఫూర్తితో తొలి అడుగు ఎల్బీ నగర్లో పడిందని.. మలి అడుగు పాలమూరులో పడుతుందన్నారు. గాంధీ జయంతిని స్ఫూర్తిగా తీసుకుని శాంతియుతంగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.
‘‘అధికారం ఉందికదా అని చేతిలో ఉన్న బలగాలను, కొద్దిమంది అధికారులను అడ్డం పెట్టుకొని మమ్మల్ని నిర్బంధించొచ్చు. నిజాంల పైజామ్‌లు ఊడగొట్టిన చరిత్ర ఈ గడ్డకు ఉంది. ఎంతోమందికి పాఠాలు, గుణపాఠాలు నేర్పిన చరిత్ర ఉంది. తెలంగాణ అనేది ఒక ల్యాండ్‌మైన్. అణు విస్ఫో టనం చెందేముందు నివురుగప్పిన నిప్పులా ఉన్న సమాజం ఇది. చైతన్యం, స్ఫూర్తి, పోరాట పటిమతో కూడుకున్నది. త్యాగాల పునాదులపై ఏర్పడిన ఈ రాష్ట్రం కేసీఆర్ చేతిలో బందీగా ఉండదు. ఈ బంధనాలు తెంచుకుంటాం.. ప్రగతిభవన్‌లో బందీ అయిన తెలంగాణ తల్లికి రాష్ట్ర విద్యార్థులు, నిరుద్యోగ యువత బంధ విముక్తి కలిగిస్తుంది. అందుకు కాంగ్రెస్ నాయకత్వం వహిస్తుంది." -రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్
ఇదీ చదవండి: ఎల్‌బీనగర్ కూడలిలో కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం