Telangana Congress Leaders Meeting With Rahul : రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు కోసం నేతలంతా ఐక్యంగా ముందుకు సాగాలని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ సూచించారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేదన్న ఆయన.. అభ్యర్థుల ఎంపికపై అధిష్ఠానానిదే తుది నిర్ణయమని స్పష్టంచేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దిల్లీలో భేటీ అయిన కాంగ్రెస్ వ్యూహకమిటీ.. రాష్ట్ర నేతలతో పలు అంశాలపై అభిప్రాయాలు స్వీకరించింది. టికెట్ల ఖరారు, నేతల ఐక్యతతో పాటు కేసీఆర్ సర్కార్ వైఫల్యాలపై ఎండగట్టాల్సిన అంశాలు, అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమాలపై అధిష్ఠానం సుదీర్ఘంగా చర్చించింది.
Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో మరికొన్ని నెలల్లో జరగనున్న శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్ వ్యూహాలను సిద్ధం చేస్తోంది. కర్ణాటకలో అనుసరించిన కొన్ని వ్యూహాలలాగే.. బీఆర్ఎస్ను గద్దె దించేందుకు ప్రత్యేక ప్రణాళికలు అమలుచేసి.. రాష్ట్రంలో విజయం సాధించాలని నిర్ణయించింది. ఈ మేరకు దిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ వ్యూహకమిటీ సమావేశం జరిగింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో రాష్ట్ర నేతలు సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మణిక్‌రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీనియర్లు జానారెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డి సహా రాష్ట్ర పార్టీ కీలక నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకునేందుకు ఎలా ముందుకు సాగాలనే అంశాలపై అధినాయకత్వం చర్చించింది. ఈ సందర్భంగా విడివిడిగా నేతల అభిప్రాయాలను స్వీకరించిన అధిష్ఠానం.. పలు సూచనలు చేసింది.
Telangana Congress meeting with Rahul : పార్టీ కోసం ఎవరెవరు ఏం చేశారో తనకు తెలుసునని నేతలతో రాహుల్‌గాంధీ చెప్పారు. పార్టీ అంతర్గత విషయాల గురించి ఎట్టి పరిస్థితుల్లో బయట మాట్లాడవద్దని స్పష్టంచేశారు. విభేదాలుంటే పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి, లేదా తనతో మాట్లాడాలన్నారు. కాంగ్రెస్‌లో ఎవరెవరు ఏం చేస్తున్నారో తెలుసునని.. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమన్నారు. అభ్యర్థుల ఎంపికపై అధిష్ఠానానిదే తుది నిర్ణయమని స్పష్టంచేశారు. పార్టీ కోసం అందరూ ఐక్యంగా పనిచేయాలని రాహుల్‌గాంధీ సూచించారు.
Revanth Reddy on CM KCR : కాంగ్రెస్ అధినాయకత్వంతో జరిగిన వ్యూహకమిటీ సమావేశంతో రాష్ట్రంలో తమ ఎన్నికల కార్యాచరణ మొదలైందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో అవినీతి ఆకాశానికి చేరితే.. అభివృద్ధికి పాతాళంలోకి వెళ్లిందన్న ఆయన.. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమాలను గడపగడపకు వెళ్లి వివరిస్తామని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే తెలిపారు.
Revanth Reddy Comments On CM KCR : దేశంలో కానీ.. తెలంగాణలోని కానీ బీఆర్ఎస్తో కాంగ్రెస్‌కు ఎలాంటి పొత్తులుండవని ఆ పార్టీ అధిష్ఠానం మరోసారి తేల్చిచెప్పింది. ఇకపై బీఆర్ఎస్ను విపక్షపక్షంగా తాము చూడబోమని.. ఏ విపక్ష సమావేశానికి పిలిచేదిలేదని వెల్లడించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఒంటరిగానే ముందుకెళ్తోందని మరోసారి స్పష్టం చేసిన కాంగ్రెస్ అధినాయకత్వం.. ఈ మేరకు పార్టీ రాష్ట్ర నేతలంతా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించింది.
రాష్ట్రంలో పార్టీకి మంచి రోజులు వచ్చాయని.. అధికారంలోకి వచ్చి తీరుతామన్న ధీమా కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. బీఆర్‌ఎస్ బహిష్కృత నేతలు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరనున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో కాంగ్రెస్‌లో ఉత్సాహం రెట్టింపయింది. ఒక్కసారిగా 35 మంది నాయకులు హస్తం గూటికి చేరనున్నట్లు.. దిల్లీ వేదికగా ప్రకటన చేయడం కీలక పరిణామంగా కాంగ్రెస్ నాయకులు అంచనా వేస్తున్నారు.
ఇవీ చదవండి: