గోపన్పల్లి భూముల వ్యవహారంలో హైకోర్టును కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆశ్రయించారు. తన భూముల్లో రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకుంటున్నారని.. అత్యవసర విచారణ జరపాలని కోరుతూ.. రేవంత్ రెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నోటీసు ఇవ్వకుండా తన భూముల్లో అధికారులు చొరబడ్డారని ఆరోపించారు. భూమిని తమకు స్వాధీనం చేయాలని శేరిలింగంపల్లి ఆర్డీవో బెదిరిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ఆర్డీవో, రెవెన్యూ అధికారులు ప్రభుత్వ ఒత్తిళ్లకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి 15 ఏళ్ల క్రితమే ఆ భూములు కొనుగోలు చేశారని.. ఆర్డీవో నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వేణుగోపాల్ వాదించారు. చర్యలు తీసుకునే ముందు కనీసం నోటీసు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వివాదానికి సంబంధించి పూర్తి వివరాలను రేపు తెలుసుకొని చెబుతానని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలుపగా న్యాయస్థానం అంగీకరించింది. విచారణ రేపటికి వాయిదా వేస్తూ.. ఎలాంటి చర్యలు చేపట్టవద్దని రెవెన్యూ అధికారులను ఆదేశించింది.
ఇదీ చూడండి: 'కరోనా సోకకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం'