కరోనా ఒక్కో కుటుంబాన్ని ఒక్కోలా వేధిస్తోంది. ఇటీవల హైదరాబాద్ కొత్తపేట డివిజన్‌లోని ఓ కాలనీలో నివసించే జీఎస్‌ఐ విశ్రాంత ఉద్యోగి(65) కరోనాతో మరణించారు. ఆయన మృతదేహాన్ని మూడురోజులపాటు ఇంట్లోనే ఉంచారా కుటుంబసభ్యులు. దుర్వాసన వస్తుండటంతో చుట్టుపక్కల వారు గమనించి అవాక్కయ్యారు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక భార్య(60) మంచాన పడి అపస్మారకస్థితికి చేరింది. అదే ఇంట్లో నివసించే ఉన్నత విద్యావంతులైన ఇద్దరు కుమారులు (42, 40) విషయాన్ని బయటకు చెప్పకుండా మూడు రోజులూ మృతదేహంతో అదే ఇంట్లో గడిపారు.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న అంబులెన్సు సిబ్బంది కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని తరలించేందుకు ససేమిరా అన్నారు. అనంతరం మరో అంబులెన్సును రప్పించిన స్థానికులు మృతదేహాన్ని తరలించి అంత్యక్రియలు జరిపించారు. కొవిడ్‌తో మంచం పట్టిన మృతుని భార్యను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆస్పత్రిలో కోలుకుంటోంది. కరోనా సోకి ఇంట్లోనే ఉన్న ఇద్దరు కుమారులకు స్థానికులే భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు.
ఇదీ చదవండి: ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద లోపాలెన్నో.. సహకరించని వాతావరణం!