Justice NV Ramana receives Akkineni award: దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత, పద్మవిభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు 99వ జయంతి వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. రసమయి సాహిత్య, సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో నిర్వహించిన ఈ వేడుకల్లో అక్కినేని కుటుంబ సభ్యుల సమక్షంలో రసమయి సంస్థ సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేసి సత్కరించింది. తమిళనాడు మాజీ గవర్నర్ రాంమోహన్ రావు చేతుల మీదుగా ఆ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా అక్కినేనితో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
నాగేశ్వరరావు విభిన్న పాత్రల్లో నటించారని.. పౌరాణికంగా ఆయన గొప్ప పేరు తెచ్చుకోలేకపోయినప్పటికీ విభిన్న భాషా చిత్రాల్లో నటించి భారతదేశ సమైక్యతను చాటిచెప్పిన గొప్ప జాతీయవాది అని జస్టిస్ ఎన్వీ రమణ కీర్తించారు. తాను ఎక్కువ సినిమాలు చూడలేకపోయినప్పటికీ ఇప్పటికీ పాత సినిమా క్యాసెట్లు, వీడియోలు చూసి చాలా ఆనందిస్తామని తెలిపారు. సినిమా రంగం గురించి ఎక్కువ విమర్శ చేయడం కాదు గానీ.. నాటి పాత సినిమాలు నిలబడినట్టుగా కొత్త సినిమాలు నిలబడటంలేదని... దీనికి కారణమేంటో సినీ రంగంలో ప్రముఖులే ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచించారు.
నేను జడ్జి కాకముందే అక్కినేని బాగా తెలుసు. ఎన్నో వేదికలు పంచుకొని మాట్లాడుకొనేవాళ్లం. నేను సినిమాలు చూడటం చాలా తక్కువ. ఎన్టీఆర్‌తో ఉన్న పరిచయం వల్ల సినీ రంగంపై అవగాహన ఉండేది. అక్కినేని తన అనుభవాలను చెబుతుంటే ఆనందంగా ఉండేది. సీజేఐగా పదవి విరమణ తర్వాత అక్కినేని పురస్కారం తీసుకోవడానికి హైదరాబాద్ వచ్చా. ఈ పురస్కారానికి నేను అర్హుడినో అనర్హుడినో గానీ ఈ అవార్డు తీసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా’’ అన్నారు. జస్టిస్ ఎన్వీ రమణ, సుప్రీంకోర్టు మాజీ ప్రధానన్యాయమూర్తి