CHAGRE FOR CREMATION : ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలోని శ్మశానాల్లో దహన సంస్కారాలకు రూ.5000 చొప్పున వసూలు చేయాలని పాలకవర్గం నిర్ణయించింది. ఇందులోనే కట్టెలు, డీజిల్, పెట్రోల్ లాంటి ఖర్చులు ఉండనున్నాయి. సర్వసభ్య సమావేశ ఎజెండాలో శవ దహనానికి రుసుము వసూలును 53వ అంశంగా చేర్చారు. పేద, ధనిక అనే సంబంధం లేకుండా.. చనిపోయిన వ్యక్తి సంస్కారాలకు కుటుంబసభ్యులకు ఇకపై రుసుము చెల్లించాలి.
ఇప్పటిదాకా వివిధ రకాల పౌరసేవలకు డబ్బులు వసూలు చేస్తూ ధనార్జనకు అలవాటు పడిన పట్టణ స్థానిక సంస్థలు.. చివరికి దహన సంస్కారాలకూ రేటు నిర్ణయించాయని స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శవ దహనం కోసం వసూలు చేస్తున్న నగదును కాటికాపరులకు జీతాలు ఇచ్చేందుకు వినియోగిస్తున్నామని అధికారులు చెబుతున్నా.. వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది.
కొవిడ్‌కు ముందు వరకు అత్యధిక ప్రాంతాల్లో కట్టెల ఖర్చుగా రూ.1000 నుంచి రూ.1500 వరకు అనధికారికంగా వసూలు చేసినట్లు సమాచారం. కొవిడ్ సమయంలో కాటికాపరులు భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులపై దృష్టి సారించిన అధికారులు.. నియంత్రణ చర్యలు తీసుకోకపోగా ధరలు పెంచేశారు. మృతుల దహనానికి రుసుము వసూలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. లేదంటే ఉద్యమిస్తామని అఖిలపక్షాలు హెచ్చరిస్తున్నాయి.
"వంతుల ప్రకారం వారానికి ఒకరి పెట్టారు. మాకు జీతం ఏమి లేదు. కేవలం కస్టమర్స్ ఇచ్చే వాటితోనే మేము జీవనం గడుపుతున్నాము. కస్టమర్స్ ఇచ్చే డబ్బులతోనే కట్టెలు, డీజిల్ లాంటివి తీసుకొస్తాం. ఆ డబ్బుల్లో ఎమైనా మిగిలితే అవి వాడుకుంటాం తప్ప ప్రభుత్వం నుంచి రూపాయి రాదు. నేను ఇక్కడ 25 సంవత్సరాల నుంచి పని చేస్తున్నా"-పంతం ఏడుకొండలు, కాటికాపరి
ఇవీ చదవండి: