ఆపదలో ఉన్నవారికి ఆపద్భాందవుడిగా చేయూతనిచ్చే.. మంత్రి కేటీఆర్కు ట్విట్టర్ వేదికగా సహాయం కోసం అభ్యర్థనలు వెల్లువెత్తున్నాయి. కొవిడ్ బారినపడి చికిత్స కోసం అవసరమైన రెమిడెసివియర్ ఇంజక్షన్లు కావాలంటూ... ఆసుపత్రిలో బెడ్ దొరకట్లేదంటూ... ఆక్సిజన్ సిలిండర్, ఆఖరికి కొవిడ్ నిర్ధరణ పరీక్షకు సైతం మంత్రి కేటీఆర్కు అభ్యర్థనలు వెల్లువెత్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా పలు నగరాల నుంచి రెమిడెసివియర్ ఇంజక్షన్ల కొరకు మంత్రి కేటీఆర్కు ఎక్కువగా వినతులు వెల్లువెత్తున్నాయి. మరికొన్ని చోట్ల ప్రభుత్వ ప్రాథమిక వైద్యకేంద్రాల్లో కొవిడ్ నిర్ధరణ పరీక్షలు పరిమిత సంఖ్యలో చేస్తున్నారని.. వీటి సంఖ్య పెంచాలని మంత్రి దృష్టికి తీసుుకువచ్చారు.
వీటన్నింటికీ మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందిస్తున్నారు. తన వ్యక్తిగత కార్యాలయం వినతులన్నింటినీ పరిష్కరిస్తుందని కేటీఆర్ హామీ ఇస్తున్నారు. అభ్యర్థనలను నోట్ చేసుకున్నామని.. వ్యక్తిగత కాంటాక్ట్ డీటెయిల్స్ షేర్ చేయండంటూ మంత్రి కార్యాలయం స్పందిస్తూ అవసరాలను తీర్చేందుకు కృషి చేస్తోంది. స్వయంగా కొవిడ్ బారిన పడి ఐసోలేషన్లో ఉన్న మంత్రి కేటీఆర్.. రాష్ట్ర ప్రజల వినతులు, ఇబ్బందులను పరిష్కరిస్తూ.. మరోసారి ప్రజల మంత్రి అనిపించుకుంటున్నారు.