పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానంతో పాటు నల్గొండ- వరంగల్- ఖమ్మం స్థానానికి నోటిఫికేషన్ను అధికారులు విడుదల చేశారు. హైదరాబాద్ స్థానానికి రిటర్నింగ్ అధికారి ప్రియాంక నోటిఫికేషన్ జారీ చేశారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 23వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 24న నామినేషన్ల పరిశీలన, 26న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 17న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో 5.60 లక్షల పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. 616 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల డీఆర్సీ కేంద్రంగా ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ నిర్వహణ చేయనున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.
వృద్ధులు, దివ్యాంగులు, కొవిడ్ బాధితులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు. నేటి నుంచి 5 రోజులపాటు పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులు స్వీకరిస్తారు.