జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉచిత తాగునీటి పథకానికి సంబంధించి.. ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఉచిత తాగునీటి పథకానికి ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకొనున్నారు. బస్తీల్లో నల్లాలకు మీటర్లు లేకున్నా.. డాకెట్ ఆధారంగా బిల్లు వసూలు చేయనున్నారు. అపార్టుమెంట్లలో మీటర్లు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన విధించారు. నీటి వినియోగం 20వేల లీటర్లు దాటితే పాత ఛార్జీలతో బిల్లు వసూలు చేస్తారు.
20వేల లీటర్లు దాటితే ప్రస్తుతం చెల్లిస్తున్న టారిఫ్ ప్రకారం బిల్లు వసూలు చేయనున్నారు. స్లమ్, బస్తీ ప్రాంతాల్లోని నల్లా కనెక్షన్లకు పూర్తిగా నీటి బిల్లు రద్దు చేశారు. ప్రత్యేకంగా మీటర్లను బిగించుకోవాల్సిన అవసరం లేకుండానే పథకం వర్తింపు చేయనున్నారు. డొమెస్టిక్ యూజర్లు 20వేల లీటర్ల ఉచితనీరు పొందాలంటే మీటర్ తప్పనిసరి ఉండాలని నిబంధన విధించారు.
సొంత ఖర్చులతోనే మీటరు బిగించుకోవాలని జలమండలి అధికారులు తెలిపారు. అపార్టుమెంట్లలోని వారికి వెసులుబాటు కల్పించిన జలమండలి.. ఒక్కో ఫ్లాటుకు 20వేల లీటర్ల చొప్పున మొత్తం ఫ్లాట్లకు మంచి నీళ్లు ఇవ్వనుంది. 10 ఫ్లాట్లు ఉండే అపార్టుమెంట్‌కు 2 లక్షల లీటర్ల వరకు ఉచితంగా నీరు సరఫరా చేయనున్నారు. 20 లక్షల లీటర్లు మించితే నీటికి పాత టారిఫ్ లెక్కన బిల్లు వసూలు చేస్తారని అధికారులు చెప్పారు.
ఇదీ చదవండి: కల్తీ కల్లోలం: 291కి చేరిన బాధితుల సంఖ్య