చిన్నారుల్లో శాస్త్రీయ విజ్ఞానం పెంపొందించడంలో రెండున్నర దశాబ్దాలుగా కీలకంగా వ్యవహరిస్తున్న తిరుపతి ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం తిరిగి తెరుచుకోవడం విద్యార్థుల్లో ఆనందం నింపుతోంది. కరోనా కారణంగా గతంలో ఎన్నడూ లేని రీతిలో సుమారు 8 నెలల పాటు మూతపడిన సైన్స్ సెంటర్.. మళ్లీ విద్యార్థులతో కళకళలాడుతోంది.
విజ్ఞాన కేంద్రంలోని 6 గ్యాలరీలు చిన్నారులు, వారి తల్లితండ్రులతో సందడిగా కనిపిస్తున్నాయి. ఫన్ సైన్స్, పాపులర్ సైన్స్, అవర్ యూనివర్స్, అవర్ సెన్సెస్, ఇల్యూజన్, ఎమర్జింగ్ టెక్నాలజీ గ్యాలరీల ద్వారా విభిన్న అంశాలపై ఇక్కడ అవగాహన కల్పిస్తారు. త్రీడీ థియేటర్ ద్వారా సైన్స్ లఘు చిత్రాలు, నక్షత్ర మండలాల ప్రదర్శనలు విద్యార్థులను అలరిస్తున్నాయి. ఐదెకరాల విస్తీర్ణంలోని అవుట్ డోర్ సైన్స్ పార్క్, ప్రీ హిస్టారిక్ లైఫ్ పార్క్, హెర్బల్ గార్డెన్స్ సందర్శకులతో కిటకిటలాడుతున్నాయి.
కరోనా వ్యాప్తికి తావులేని రీతిలో పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. సందర్శకులకు ఇచ్చే టికెట్లు, నగదును యూవీ సిస్టమ్స్ ద్వారా శానిటైజ్ చేస్తున్నారు. పరికరాలను తాకేటపుడు సైతం వైరస్ ముప్పు లేకుండా చేతి గ్లౌజులు అందిస్తున్నారు. వారాంతాల్లో పిల్లలను ప్రాంతీయ విజ్ఞాన కేంద్రానికి పంపించటం ద్వారా వారి ఆలోచనా శక్తి మరింత ఇనుమడిస్తుందని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: కొవిడ్ టీకా పంపిణీపై అధికారులు, సిబ్బందికి శిక్షణ