కరోనా నేపథ్యంలో ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు కూడా ప్రభుత్వం ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించింది. చిన్నారులు ఇంటి వద్దే ఉంటూ ఆడుతూ పాడుతూ పాఠాలు నేర్చుకునేలా ‘రీడ్ ఎలాంగ్’ యాప్‌ను వినియోగించుకునేలా చూడాలని ఉపాధ్యాయులకు రాష్ట్ర విద్యాశాఖ సూచించింది. గూగుల్ రూపొందించిన ఈ యాప్ విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుందని ఎన్‌సీఈఆర్‌టీ, ఎస్‌సీఈఆర్‌టీలు సిఫార్సు చేశాయి.
ఆటపాటల ద్వారా...
సాధారణంగా ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు ఆటపాటల ద్వారా సమాచారం అందిస్తే ఆసక్తిగా వింటారు. దీన్ని ఆధారంగా చేసుకొని రూపొందించిందే ‘రీడ్ ఎలాంగ్’యాప్. తెలుగు, ఆంగ్లంతోపాటు లెక్కల్ని ఆడుతూ, పాడుతూ నేర్పే ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లోని రీడింగ్ సహాయకురాలు ‘దియా’(బొమ్మ) పదాలను ఎలా పలకాలో చెబుతుంది. ఎలా చదువుతున్నారో మదింపు చేస్తుంది. బాగా చదివితే అభినందిస్తుంది. మెరుగైన ప్రతిభ చూపితే ‘స్టార్స్’ ఇస్తుంది. పదాలు, వాక్యాలు చదవడం వంటివి చేయిస్తుంది. సరిగా చదవకపోతే మరోసారి చదవమని చెబుతుంది.
యాప్‌లో గ్రంథాలయం..
యాప్‌లో గ్రంథాలయం కూడా ఉంది. ప్రథమ్ పుస్తకాలు, బాలల కథలు, ఛోటా భీమ్ సహా ఎప్పటికప్పుడు కొత్త కథలను అందుబాటులోకి తెస్తారు. చదువు, తరగతి సామర్థ్యానికి సరిపోయే ఆటలూ ఉన్నాయి. యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుని, ఆ తర్వాత ఆఫ్‌లైన్ ద్వారా వినియోగించుకోవచ్చని జనగామ జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు పసునూరి సోమరాజు తెలిపారు.
ఇదీ చూడండి: సెకన్లలోనే కరోనా టీకా ధ్రువపత్రం.. ఎలాగంటే?