కొవిడ్-19 వ్యాప్తి సందర్భంగా గత రెండున్నర నెలలుగా మూసి ఉన్న షాపింగ్ మాల్స్ సోమవారం నుంచి తెరుచుకోవచ్చని ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. షాపింగ్ స్టోర్లు, థియేటర్లు, రిక్రేయేషన్ హబ్‌లు, ప్లే స్పాట్ హబ్‌లుగా ఎక్కువ మందిని ఆకర్షించే మాల్స్‌తో కరోనా వేగంగా వ్యాపిస్తుందనే కారణంగా వీటికి అనుమతులు ఆలస్యమయ్యాయి.
భౌతిక దూరం తప్పనిసరి !
సోమవారం పునః ప్రారంభమైన మాల్స్‌లో పరిమితికి లోబడే వినియోగదారుల్ని అనుమతించనున్నారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా భౌతిక దూరం పాటించేలా చూడాలని యాజమాన్యాలను ప్రభుత్వం ఆదేశించింది. బాడీ టెంపరేచర్ టెస్టింగ్, డిస్ఇన్ఫెక్టివ్స్ పిచికారీ వంటి జాగ్రత్తలు తీసుకుంటూ షాపింగ్‌కు అనుమతులు జారీ చేసింది. మాల్స్ తెరిచేందుకు ఇవాళ మొదటి రోజు కావటం.. గతంలో మాదిరి స్వేచ్ఛగా అనుమతించకపోవటం వల్ల రద్దీ సాధారణంగానే ఉంది. మరో రెండు రోజుల్లో వ్యాపారం పుంజుకునే అవకాశాలున్నాయి.