ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ఎత్తిపోతల పథకం పరిశీలనపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు మరోసారి ఏపీ జలవనరులశాఖకు లేఖ రాసింది. రాయలసీమ ఎత్తిపోతల ఒక్కటే కాకుండా, అన్ని ప్రాజెక్టులు పరిశీలించాలన్న జలవనరులశాఖ... ఈ అంశంపై బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకోవాలంటూ వారం రోజుల కిందట లేఖ రాసింది. ఇంతలోనే మళ్లీ లేఖ రాసిన కృష్ణా బోర్డు.... ఈ నెల 19, 20 తేదీల్లో పరిశీలనకు వస్తామని చెప్పింది.
హరికేశ్ నేతృత్వంలో..
ప్రాజెక్టు గురించి అన్ని విషయాలు తెలిసిన అధికారిని నామినేట్ చేయాలని, సంబంధిత నివేదికలు అందజేయాలని కోరుతూ... కృష్ణా బోర్డు తరఫున హరికేశ్ మీనా సోమవారం రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శికి రాసిన లేఖలో పేర్కొన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పరిశీలించడానికి ఏర్పాటుచేసిన బృందానికి హరికేశ్ నేతృత్వం వహించనుండగా.... కార్యదర్శి రాయిపురే, బోర్డు సభ్యుడు ఎల్.బి.ముతంగ్, కేంద్ర జలసంఘంలో డైరెక్టర్‌గా ఉన్న దేవేందర్రావు సభ్యులుగా ఉన్నారు.
ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలో..
బోర్డు అంటే ఛైర్మన్, కార్యదర్శి మాత్రమే కాదని... సభ్యులందరితో కలిసి పూర్తిస్థాయి సమావేశం ఏర్పాటుచేసి, ఏయే ప్రాజెక్టులు పరిశీలించాలో నిర్ణయం తీసుకోవాలని ఈ నెల ఐదో తేదీన ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఛైర్మన్‌కు లేఖ రాసింది. బోర్డు చైర్మన్ వైఖరిని తప్పుపట్టినట్లు కూడా తెలిసింది.
ఛైర్మన్‌ను మార్చండి..
ఛైర్మన్‌ను మార్చాలని కేంద్ర జలశక్తి శాఖకు కూడా లేఖ రాసింది. జోర్డులో చర్చించకుండా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును మాత్రమే పరిశీలించడాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ రెండుసార్లు లేఖలు రాసినా, ఈనెల 19, 20 తేదీల్లో పర్యటనకు వస్తున్నట్లు మూడోసారి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. తమ అభిప్రాయాన్ని ఇప్పటికే చెప్పామని, తాజాగా రాసిన లేఖకు అదే సమాధానం చెబుతామని.... బోర్డు రాసిన లేఖ అందిన అనంతరం జలవనరులశాఖ వర్గాలు అంటున్నాయి.
ఇదీ చదవండి: కాళేశ్వరం బ్యాక్‌వాటర్‌తో నిండా మునిగిన కొందరు అన్నదాతలు