హైదరాబాద్ ఆదర్శ నగర్లోని బిర్లాసైన్స్ ఆడిటోరియంలో.. రాష్ట్ర వీర శైవలింగాయత్, లింగబలిజ సంఘం నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారితో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆవిష్కరించారు.
ముందుకు వెళ్తోంది..
బీసీ జాబితాలో ఉన్న కొన్ని కులాలను ఓబీసీ జాబితాలో చేర్చే ప్రక్రియ వేగవంతమైందని జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి పేర్కొన్నారు. కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా వస్తున్న వినతులు దృష్ట్యా జాతీయ బీసీ కమిషన్ ముందుకు వెళ్తుందన్నారు.
క్యాబినెట్ ముందుకు
మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఉన్న లింగాయత్లతో పాటు.. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం బీసీలలో చేర్చిన 26 సంచార కులాలను ఓబీసీలో చేర్చే అంశంపై క్యాబినెట్ ముందుకు తీసుకెళ్లనున్నట్లు తల్లోజు ఆచారి పేర్కొన్నారు.
తీవ్ర అన్యాయం
బీసీలను ఓబీసీ జాబితాలో కలపకపోవడం వల్ల అన్ని రంగాల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆర్.కృష్ణయ్య తెలిపారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రతి ఒక్క బీసీ సంఘ నాయకుడు ముందుకు రావాలని కోరారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల 50 వేల పోస్టులతో పాటు.. కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం చేస్తున్నాయన్నారు. తక్షణమే పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని కోరుతూ.. దిల్లీ స్థాయిలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కృష్ణయ్య స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:తహసీల్దార్ కార్యాలయాల్లో పని విభజన చేయాలి: కిషన్‌రెడ్డి