రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లల్లో ఓ అరుదైన రికార్డు నమోదైంది. ఈ ఏడాది వానాకాలం, యాసంగి రెండు పంటలు కలిపి ఇప్పటి వరకు కోటి 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి పౌరసరఫరా సంస్థ సరికొత్త రికార్డు సృష్టించింది. గతేడాది మొత్తం ఒక కోటి 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా... ఆ రికార్డును అధిగమించింది. దేశంలో దొడ్డు రకం బియ్యానికి డిమాండ్ తగ్గుతుందనే ముందు చూపుతో ముఖ్యమంత్రి కేసీఆర్... ఈ ఏడాది వానాకాలంలో సన్నాలు సాగు చేయాలని సూచించారని... ప్రతిపక్షాలు విమర్శించాయని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
వానాకాలంలో దాదాపు 25 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం మిల్లర్లు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్ర వ్యాపారులు దాదాపు 15 లక్షల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలు చేసినట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రతి సీజన్‌కు నిబంధనలు మారుస్తున్న ఎఫ్‌సీఐ వచ్చే సీజన్ నుంచి దొడ్డు రకం బియ్యం తీసుకునే పరిస్థితి లేని దృష్ట్యా... రైతులు ఒకసారి ఆలోచన చేయాలని చెప్పారు. వినియోగదారుల ఆహారపు అలవాట్లు, అభిరుచులకు అనుగుణంగా బహిరంగ మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల సాగు వైపు ఆలోచన చేయాలని సూచించారు.
ఏ పంటలకు మార్కెట్లో డిమాండ్ ఉంటుంది...? ఏ పంటలు వేస్తే మంచి ధర వస్తుంది...? వంటి అంశాలు రైతులు, వ్యవసాయ నిపుణులు చర్చించుకోవడానికి దేశంలో ఎక్కడా లేనిరీతిలో ముఖ్యమంత్రి ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికలు ఏర్పాటయ్యాయని వివరించారు. ప్రధాన ఆహార పంట వరికి ప్రత్యామ్నాయంగా పత్తి, కందులు, ఆయిల్‌ఫామ్ వంటి పంటలపై దృష్టి సారించాలని కోరారు. పట్టణాలకు దగ్గర ఉన్న ప్రాంతాల్లో పండ్లు, కూరగాయలు, పూలు వంటి ఉద్యాన పంటలు సాగుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని శ్రీనివాస్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: Formation day: ఎనిమిదో వసంతంలోకి తెలంగాణ... నిరాడంబరంగానే వేడుకలు