ఏపీ విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద కేసు విచారణకు సంబంధించి పోలీసుల విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని రమేశ్ ఆసుపత్రుల మేనేజింగ్ డైరెక్టర్ డా. రమేశ్‌బాబు తరపున రమేశ్ ఆసుపత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ కేసు విచారణకు సంబంధించి తనను మళ్లీ హాజరుకావాలని సెక్షన్ 160 సీఆర్‌పీసీ నోటీసు ఇచ్చారని... ప్రస్తుతం ఉన్నటువంటి కొవిడ్- 19 తీవ్ర పరిస్థితులలో, సుప్రీంకోర్టు.. కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయొద్దని పోలీసులు వారికి ఆదేశాలు ఇచ్చిందని పేర్కొన్నారు. వీటి ప్రకారం తన కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తనను దృశ్య, శ్రవణ విధానంలో విచారించమని డా. రమేశ్‌బాబు ప్రకటనలో కోరారు.
హోటల్ యాజమాన్యానిదే బాధ్యత
స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదంలో పది మంది ప్రాణాలు కోల్పోవడానికి స్వర్ణప్యాలెస్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమనే విషయాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీ ఇచ్చిన నివేదిక, ఆ తర్వాత విజయవాడ పోలీసులు హైకోర్టులో సీఆర్‌ఎల్‌పీ 3444/2020లో దాఖలు చేసిన యాక్షన్ సబ్ సీక్వెంట్ రిపోర్టు నిర్ధరిస్తున్నాయన్నారు. హోటల్ నిర్వహణకు తాము పూర్తి బాధ్యత వహిస్తామని హోటల్ స్వర్ణ ప్యాలెస్ మేనేజింగ్ డైరెక్టర్ హామీ ఇచ్చిన తర్వాత మాత్రమే... హోటల్, ఆసుపత్రి యాజమాన్యాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందన్నారు. అప్పటికే పెయిడ్ క్వారంటైన్ సెంటర్‌ను ప్రభుత్వ అనుమతితో స్వర్ణ ప్యాలెస్‌లో నిర్వహిస్తున్నారన్నారు.
కొన్ని గదులు మాత్రమే ఆసుపత్రికి కేటాయింపు
హోటల్ ఆక్యుపెన్సీ, ఫైర్ ఎన్ఓసీ తీసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా.. హోటల్ యాజమాన్యానిదేనని రమేశ్ ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. కొవిడ్ రోగుల వైద్య చికిత్స కోసం కొన్ని రూములు మాత్రమే రమేశ్ ఆసుపత్రి యాజమాన్యానికి కేటాయించారన్నారు. లీజు ప్రసక్తే ఈ ఒప్పందంలో రాలేదని, రోగులకు కేటాయించిన రూములకు అద్దె నేరుగా హోటల్ యాజమాన్యమే వసూలు చేసుకుని రశీదులు ఇచ్చిందన్నారు. 2020 సెప్టెంబరు 15న... 11 అంశాలకు సంబంధించిన ప్రశ్నావళితో సెక్షన్ 91 సీఆర్‌పీసీ కింద నోటీసును చీఫ్ కార్డియాలజిస్టు డా. రమేశ్‌బాబుకు ఇవ్వగా... 2020 సెప్టెంబరు 17న అన్ని అంశాలకు సంబంధించి డా. రమేశ్‌బాబు సమాధానం ఇచ్చారని యాజమాన్యం తెలిపింది.
అన్ని వివరాలు అందిస్తాం
హోటల్ నిర్వహణకు సంబంధించి రెండు యాజమాన్యాల ఒప్పందం మేరకు జరిగిన ఆడియో టేపులు, హోటల్ యాజమాన్యానికి... ఆసుపత్రి పేషెంట్ కేర్ టీమ్స్‌కు జరిగిన వాట్సప్ సందేశాలను విచారణ అధికారి ఏసీపీకి అందజేశామని రమేశ్ ఆసుపత్రి పేర్కొంది. ఈ సందేశాలలో జులై 23 నుంచి అగ్నిప్రమాద దుర్ఘటన జరిగే వరకు ప్రతిరోజు హోటల్ నిర్వహణలో హోటల్ మేనేజర్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్‌బాబు, ఆసుపత్రికి సంబంధించి పేషెంట్ మెడికల్ కేర్ అందించే సిబ్బంది సందేశాలను యథాతథంగా సమర్పించినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: రాష్ట్రానికి రావాల్సిన ఐజీఎస్టీ బకాయిలు వెంటనే ఇవ్వాలి: హరీశ్