Ramanuja Sahasrabdi Utsav Day 5: ముచ్చింతల్‌దారులన్నీ రద్దీగా కనిపించాయి. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తుల రాకతో ముచ్చింతల్ పరిసరాలు కిటకిటలాడాయి. విగ్రహం వద్ద స్వీయచిత్రాలు తీసుకుంటూ సందర్శకులు ఉత్సాహంగా గడిపారు. యగశాలలు సందర్శించి హోమాలు తిలకించారు. తితిదే కార్యనిర్వహణాధికారి జవహర్‌రెడ్డి, విశ్వహిందూపరిషత్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్‌కుమార్, సూర్య తేజస్వి, దేవరాజన్, వల్లభ్‌స్వామిలు కూడా సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో జీహెచ్‌ఎంసీ తరఫున విశేష సేవలందిస్తున్నారు. రెండు షిఫ్టుల్లో 800 మంది కార్మికులు పనిచేసున్నారు.
నేటి కార్యక్రమాలు..
- ఉదయం, సాయంత్రం హోమాలు జరుగుతాయి.
- ఇష్టిశాలల్లో అకాలవృష్టి నివారణ, సస్యవృద్ధి, వ్యక్తిత్వ వికాసం, ఆత్మోజ్జీవనకు వైయ్యూహికేష్టి నిర్వహిస్తారు.
- ప్రవచన మండపంలో శ్రీకృష్ణ అష్టోత్తర శతనామ పూజ, ప్రవచనాలు ఉంటాయి.
అమెరికా చిన్నారులు.. అవధానంలో ప్రజ్ఞులు
వారంతా అమెరికాలోని వివిధ ప్రాంతాలకు చెందిన చిన్నారులు.. తమ సంస్కృతి సంప్రదాయాలపై మక్కువ పెంచుకున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఆన్‌లైన్‌లో భగవద్గీత తరగతులకు హాజరయ్యారు. భగవద్గీత గ్రంథంలోని పుటలు, అధ్యాయాలు, శ్లోకాలు ఔపోసన పట్టారు. సంఖ్య చెబితే చాలు ఆ శ్లోకాన్ని ఇట్టే చెప్పేశారు. చిన జీయర్ స్వామి సమక్షంలో మొత్తం ఎనిమిది మంది చిన్నారులు భక్తులు.. సంధించిన ప్రశ్నలకు కంప్యూటర్ కంటే వేగంగా సమాధానాలు ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. మొత్తం తొమ్మిది విభాగాలుగా విభజించి వారి ప్రతిభను పరీక్షించాల్సిందిగా భక్తులకు జీయర్ స్వామి అవకాశం ఇచ్చారు. వందలాది మంది భక్తులు రకరకాల ప్రశ్నలు అడిగితే.. వారు సమాధానాలు ఇస్తూ ప్రతిభ చాటుకున్నారు.
హైకోర్టు న్యాయమూర్తుల సందర్శన
సమతామూర్తి కేంద్రాన్ని ఆదివారం హైకోర్టు న్యాయమూర్తులు సందర్శించారు. శ్రీరామానుజుల విగ్రహాన్ని, దివ్యక్షేత్రాలను సందర్శించి అక్కడి విశిష్టతలను తెలుసుకున్నారు. చినజీయర్‌స్వామిని కలిసి ఆశీర్వచనాలు అందుకున్నారు. సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించిన వారిలో న్యాయమూర్తులు జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ అభిషేక్‌రెడ్డి, జస్టిస్ ఎ.వెంకటేశ్వరరెడ్డి, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం ఉన్నారు. ఏపీ ఉప సభాపతి కోన రఘుపతి కూడా కేంద్రాన్ని సందర్శించారు.
ఇదీ చూడండి: Ramanuja Sahasrabdi Utsav: శోభాయమానంగా రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు