కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు జరిగి.. వాటా కేటాయించే వరకు గెజిట్ నోటిఫికేషన్ ఆపాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును(KRMB Meeting news) కోరామని రాష్ట్ర నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ వెల్లడించారు. కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశానికి హాజరైన రజత్‌కుమార్.. రాష్ట్ర అభ్యంతరాలు తెలిపామన్నారు. కృష్ణా పరిధిలో 65 కేంద్రాలు గెజిట్ నోటిఫికేషన్‌లో ఉన్నాయని వివరించారు. నాగార్జునసాగర్‌పై 18, శ్రీశైలంపై 12 కేంద్రాలు ఇవ్వాలని బోర్డు ప్రతిపాదించిందని వెల్లడించారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు బోర్డు పరిధిలోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కోరిందని.. తాము అభ్యంతరం చెప్పామని రజత్‌కుమార్ తెలిపారు. ప్రాజెక్టు యాజమాన్య హక్కుల విషయమై న్యాయసలహా ఆడిగామన్నారు.
కొత్త నిర్ణయాలు తీసుకోలేదు..
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(KRMB Meeting news) సమావేశంలో కొత్తగా ఏ నిర్ణయాలు తీసుకోలేదని రజత్‌కుమార్(Rajat Kumar Comments) తెలిపారు. విద్యుదుత్పత్తికి అనుమతి ఇవ్వాలని ఏపీ అడుగుతోందని వెల్లడించారు. ఈ నెల 14లోగా స్పష్టమైన నిర్ణయం వెల్లడిస్తామని పేర్కొన్నారు. త్వరలో కేంద్రానికి, ఏపీకి తమ నిర్ణయాన్ని చెబుతామని స్పష్టం చేశారు. ప్రాజెక్టులకు రుణాల గురించి ఏమీ చర్చించలేదని రజత్‌కుమార్ అన్నారు. శ్రీశైలంలో నిబంధనల ప్రకారమే విద్యుదుత్పత్తి చేస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్ జలసౌధలో కేఆర్ఎంబీ(KRMB) ఛైర్మన్ ఎం.పి.సింగ్ అధ్యక్షతన బోర్డు ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ భేటీకి నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధర్, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్సీ నారాయణరెడ్డి హాజరయ్యారు.
యాభై శాతం వాటా అడుగుతున్నాం..
భేటీకి హాజరయ్యేముందు మీడియాతో మాట్లాడిన రజత్ కుమార్... కృష్ణా జలాల్లో 50 శాతం వాటా కోరుతున్నామని తెలిపారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా పెరగాలని.. నదీ పరివాహక ప్రాంతం ఇక్కడే ఎక్కువగా ఉందని వెల్లడించారు. కొత్త ట్రైబ్యునల్ వచ్చే వరకు మరో 105 టీఎంసీలు ఇవ్వాలని... నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్, కల్వకుర్తి ప్రాజెక్టులకు నికర జలాలు కేటాయించాలని మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణకు వాటా ప్రకారం 570 టీఎంసీలు కేటాయించాలనే అంశంపైనా చర్చలు జరుగుతున్నాయని అన్నారు. బోర్డు పరిధిలోకి విద్యుత్ ప్రాజెక్టులు తీసుకురావాలని కోరుతున్నారని... కనీస నీటిమట్టాలు నిర్ణయిస్తే బాగుటుందని అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టుల నిర్వహణ ఎలా చేస్తారని అడుగుతున్నామని... ఇవాళ్టి సమావేశం తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు. బోర్డు పరిధిలోకి ఏయే ప్రాజెక్టులు ఇవ్వాలనేది చర్చిస్తామని వివరించారు.
బోర్డు పరిధిలోకి విద్యుత్ ప్రాజెక్టులు సైతం ఉండాలని కోరుతున్నారు. తెలంగాణలో అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి. నీటి వాటాలతో పాటు విద్యుత్ ఉత్పత్తి కూడా మాకు చాలా ముఖ్యం. తెలంగాణకు విద్యుత్ చాలా ముఖ్యం. ఎత్తిపోతల పథకాలు, బోరు బావులున్నందున అవసరం ఉన్నప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. విద్యుత్ ఉత్పత్తికి ప్రాజెక్టుల్లో కనీస నీటిమట్టాలు నిర్ణయించి.. అందుకు అనుగుణంగా చేస్తే బాగుంటుంది.
-రజత్ కుమార్, రాష్ట్ర నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
ఇదీ చదవండి: Rajath Kumar Comments: 'కృష్ణా జలాల్లో 50 శాతం వాటా కోరుతున్నాం'