అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో 230 సంవత్సరాల చరిత్ర కలిగిన జార్జిటౌన్ యూనివర్సిటీ తమ దగ్గర దౌత్యవిద్య పూర్తి చేసిన విద్యార్థులలోని అయిదుగురిని శతాబ్ది పురస్కారానికి ఎంపిక చేసింది. ఆ పురస్కారానికి అక్కడ విద్యను అభ్యసించిన తెలుగు వ్యక్తి ఎంపికయ్యారు. ఆయనే రాజా కార్తికేయ గుండు. ఆయన ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో దౌత్యవేత్తగా విధులు నిర్వహిస్తున్నారు. రాజా కార్తికేయ భారతీయ విద్యా భవన్, నిజాం కళాశాలలో విద్యను అభ్యసించారు. ఐఐఎఫ్టీ దిల్లీలో ఎంబీఏ పూర్తి చేశారు. జార్జిటౌన్ యూనివర్సిటీలోని వాల్ష్ స్కూల్ ఆఫ్ ఫారిన్ సర్వీస్ నుంచి 2007-2009లో (మాస్టర్ ఆఫ్ ఫారిన్ సర్వీస్)ను పూర్తి చేశారు.
గత వందేళ్ల కాలంలో ఎంఎస్ఎఫ్ఎస్ కోర్సు పూర్తి చేసిన వందమందికి పైగా అభ్యర్థుల పేర్లు శతాబ్ది పురస్కారం పరిశీలనకు వచ్చాయని ఎంఎస్ఎఫ్ఎస్ కమిటీ తెలిపింది. వాటిల్లో నాయకత్వం, సృజనాత్మకత, విలువలు, సమాజ సేవ, మానవ సంబంధాలు ప్రామాణికంగా అభ్యర్థుల ఎంపిక జరిగిందని చెప్పింది. ఈ ఎంపిక కమిటీలో పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు, యూనివర్సిటీ అధ్యాపక ప్రతినిధులు పాల్గొన్నారని పేర్కొంది. అందరి అభ్యర్థుల వివరాలను పరిశీలించిన తర్వాత ఈ అయిదుగురిని ఎంపిక చేసినట్లు ప్రకటించింది. ఈ అవార్డులను డిసెంబర్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఆ ఐదుగురికి పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు కమిటీ వెల్లడించింది. ఈ అంతర్జాతీయ సంబంధాలు కోర్సులో ప్రపంచంలో కెల్లా జార్జిటౌన్ యూనివర్సిటీ అగ్ర స్థానంలో ఉంది.
"జనవరి 2001 గుజరాత్ భూకంపం, డిసెంబర్ 2004 సునామీ సమయంలో స్వచ్ఛందంగా సేవలందించాను. జార్జిటౌన్ యూనివర్సిటీలో ఎంఎస్ఎఫ్ఎస్ విద్యను అభ్యసిస్తున్నప్పుడు చైనా-కొరియా-జపాన్ల మధ్య దౌత్య సంబంధాలు వంటి అంశాలపై ఆయా దేశాల దౌత్యవేత్తలతో చర్చా కార్యక్రమాలు నిర్వహించాను. 2011-15 మధ్య కాలంలో అఫ్గానిస్థాన్లో శాంతి, పునర్నిర్మాణం సేవల్లో యూఎన్ తరఫున ఉద్యోగరీత్యా పాల్గొన్నాను. 2021లో అమెరికాలోని 15 మంది తెలుగు డాక్టర్ల సహకారంతో జూమ్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ అవగాహన ప్రచారం నిర్వహించాను. కరీంనగర్ జిల్లాలోని రాజన్నపేట గ్రామంలో మిత్రుల సహకారంతో కరోనా రహిత గ్రామంగా ఎలాంటి పద్ధతులను అవలంభించాలో చేసి చూపించాను." ఇటువంటి అంశాలు ఈ శతాబ్ది పురస్కారానికి ఎంపిక అయ్యేలా చేశాయని కార్తికేయ అన్నారు.
ఇవీ చదవండి:ప్రజల కోసం పోరాడిన కుటుంబం మాది.. ఇప్పటి కేంద్ర ప్రభుత్వంలో సమరయోధులేరీ?
కమల్ సాంగ్‌కు శ్రుతి హాసన్ డ్యాన్స్.. జంప్సూట్లో అదరగొట్టిన బ్యూటీ