Raj Bhavan Clarified on Governor Absence at Secretariat Opening: రాష్ట్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు గవర్నర్ తమిళిసైకి ఆహ్వానం రాలేదని రాజ్‌భవన్ పేర్కొంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయానికి గవర్నర్‌కు పిలువు రాలేదని రాజ్‌భవన్ వెల్లడించింది. సచివాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించినప్పటికీ గవర్నర్ రాలేదన్న ఆరోపణలను రాజ్‌భవన్ తోసిపుచ్చింది. గవర్నర్‌పై చేసిన ఆరోపణలు సత్యదూరం, ఆధార రహితమని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆహ్వానం రాలేదని స్పష్టం చేసింది. కేవలం ఆహ్వానం లేనందువల్లే సచివాలయ ప్రారంభానికి గవర్నర్ రాలేదని రాజ్‌భవన్ తెలిపింది.
అంబేడ్కర్ విగ్రహావిష్కరణకూ అందని ఆహ్వానం: ఇలానే గతంలో మరో ఘటన జరిగింది. డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ లాంటి మహోన్నత వ్యక్తి విగ్రహావిష్కరణకు.. రాష్ట్ర గవర్నర్‌గా తనకు ఆహ్వానం ఇవ్వలేకపోవడం ఆశ్చర్యంగా ఉందని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. విగ్రహావిష్కరణకు తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదని పేర్కొన్నారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం వచ్చి ఉంటే కచ్చితంగా వెళ్లే ఆలోచనతో ఉన్నానని గవర్నర్ స్పష్టం చేశారు. ఆహ్వానం రానందున.. రాజ్‌భవన్‌లోనే అంబేడ్కర్‌కు నివాళులు అర్పించాల్సి వచ్చిందన్నారు.
ఘనంగా సచివాలయ ప్రారంభోత్సవం: నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ఏప్రిల్ 30న ప్రారంభించారు. నూతనంగా ప్రారంభించిన సచివాలయానికి రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టారు. ఈ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ సహా ప్రభుత్వ యంత్రాంగమంతా హాజరైంది. వీరందరి సమక్షంలో వేద పండితుల ఆశీర్వచనాలతో ఈ వేడుక వైభవంగా జరిగింది. ముందుగా సచివాలయంలో వేద పండితులతో సుదర్శన, చండీ, వాస్తు హోమాలు చేశారు. ఆ సమయంలో సచివాలయం మొత్తం మంత్రోచ్ఛారణలతో మారుమోగిపోయింది.
సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 1:20 నిమిషాల నుంచి 1:32 నిమిషాల మధ్య నూతన సచివాలయాన్ని ప్రారంభించారు. ఈ సచివాలయం నాలుగు కోట్ల ప్రజానీకం ఆకాంక్షలను నెలవేర్చేలా ఆత్మగౌరవ ప్రతీకగా ఆధునికత, సంప్రదాయం, సాంకేతికత విరజిల్లేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ప్రారంభ వేడుక రోజు సీఎం కేసీఆర్ ఆరు దస్త్రాలపై సంతకం పెట్టారు. ఆ తరవాత అధికారులు వారి ఛాంబర్లో వేరే వాటిపై సంతకాలు చేశారు. మధ్యాహ్నం సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడారు.
ఇవీ చదవండి: