శ్రీశైలం జలాశయం నీటిమట్టం ఆదివారం రాత్రి 8 గంటల సమయానికి 883.80 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 208.7210 టీఎంసీలుగా నమోదైంది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ఇక్కడ 10గేట్లను 15 అడుగుల మేర పైకి ఎత్తి స్పిల్ వే ద్వారా 3,71,720 క్యూసెక్కులు, శ్రీశైలం కుడి, ఎడమ గట్టు జల విద్యుత్తు కేంద్రాల్లో 63,499 క్యూసెక్కుల వరద నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతుందన్నారు.
సాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వు వృథా భూమిగానే పరిగణన
లక్షలాది పశువులకు మేత ఇచ్చే సువిశాల పచ్చిక నేలలపై నిర్లక్ష్యం ఆవహించింది. దేశంలో ఇలాంటివి అయిదు ఉండగా అందులో ఒకటి నాగార్జున సాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వులోని పచ్చిక భూమి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పరిధిలో ఇది ఉంది. ఈ నిర్లక్ష్యానికి ఎంతో చరిత్ర ఉందని వీటిపై ఉమ్మడిగా అధ్యయనం చేసిన ఎ.టి.వానక్, ఎం.డి.మధుసూదన్ తెలిపారు. బ్రిటిష్ ప్రభుత్వం వీటిని అసలు పట్టించుకోలేదని, ఇప్పుడు కూడా అదే ధోరణి కనిపిస్తోందని చెప్పారు. ప్రభుత్వ దస్త్రాల్లో వీటిని బీడు భూములుగా పేర్కొన్నారని, అందుకే వీటి ప్రాధాన్యాన్ని గుర్తించలేదని తెలిపారు. చెట్లు లేని వాటిని వృథా నేలలుగా పరిగణించేవారని, ఇక్కడ ఉన్న పచ్చగడ్డి ప్రాముఖ్యతను గమనించలేదని తెలిపారు.
పనికిరాని భూములని భావించి ఇక్కడ సౌర, పవన విద్యుత్తు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండడంతో ఆ నేలలు ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దేశంలో ఇలాంటి భూములు మరో నాలుగుచోట్ల కూడా ఉన్నాయి. రాజస్థాన్‌లోని డెజర్ట్ నేషనల్ పార్క్, కైలాదేవి వన్యమృగ సంరక్షణ కేంద్రం, గుజరాత్‌లోని కచ్ ఎడారి వన్యమృగ సంరక్షణ కేంద్రం, బిహార్‌లోని కైమూర్ వన్యమృగ సంరక్షణ కేంద్రానిదీ ఇదే పరిస్థితి. దేశంలో 3,19,674 చదరపు కి.మీ.ల విస్తీర్ణంలో పచ్చిక నేలలు, ఎడారులు ఉన్నాయి. మొత్తం భూభాగంలో ఇవి పదో వంతు. ఇందులో సగం భూమి కూడా పరిరక్షణలో లేదు.
ఇదీ చదవండి: Friendship Day: స్నేహ బంధం.. ప్రతి ఒక్కరి జీవితంలో మధుర క్షణాలే