రాష్ట్రంలో పలు జిల్లాల్లో తెల్లవారుజాము నుంచే ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తున్నాయి. నల్గొండ జిల్లా చండూరు, మునుగోడు, నాంపల్లి, మర్రిగూడ మండలాల్లో ఉదయం నుంచే ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నాంపల్లి మండలంలోని శేసీలేటి వాగు, చండూర్ మండలంలోని శిర్దేపల్లి వాగు, బొడంగిపర్తి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. చండూర్ పురపాలికలోని లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు జలమయమయ్యాయి. మురుగు నీటి వ్యవస్థ సరిగ్గా లేక.. రహదారులపైనే నీళ్లు ప్రవహిస్తున్నాయి.
నల్గొండ జిల్లా నాంపల్లి, చండూర్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. తూకం వేసిన బస్తాలూ తడిసి ముద్దయ్యాయి. అధికారుల నిర్లక్ష్యం వల్ల నెల నుంచి కొనుగోళ్ల జాప్యం జరిగిందని.. ఇప్పుడు నిండా మునిగిపోయామని రైతులు వాపోయారు.
ఆలయంలోకి నీరు..
యాదాద్రిలో తెల్లవారుజామున కురిసిన వర్షానికి ఆలయంలోకి నీరు చేరింది. బాలాలయంలోకి పెద్దఎత్తున చేరిన నీరు... మెట్ల దారి గుండా క్యూ లైన్లలోకి ప్రవహించింది. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ కార్యక్రమంలో ఇబ్బందులు తలెత్తాయి. నీళ్లలోనే పూజాది కార్యక్రమాలు నిర్వహించారు.
లోతట్టు ప్రాంతాలు జలమయం..
ఖమ్మంలో ఉదయం గంటపాటు కురుసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని మయూరి కూడలి, ప్రకాశ్ నగర్, మూడో పట్టణ ప్రాంతంలోని రోడ్లపై పెద్దఎత్తున నీరు చేరింది.
నిలిచిన విద్యుత్ సరఫరా..
కరీంనగర్లో తెల్లవారుజాము నుంచే చిరుజల్లులు ప్రారంభమయ్యాయి. హన్మకొండలో కురిసిన భారీ వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. పలు కాలనీలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ములుగు జిల్లా వెంకటాపూర్, గోవిందరావుపేట, ములుగు మండలాల్లోనూ భారీ వర్షం కురిసింది. దీంతో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జంగాలపల్లి, వెంకటాపూర్, గోవిందరావుపేట, పస్రా ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయింది.