TELANGANA WEATHER REPORT TODAY: రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈరోజు నిర్మల్, నిజామాబాద్, రాజన్నసిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, సిద్ధిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామరెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
రేపు మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి.. ఎల్లుండి వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు నమోదవుతాయని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
హైదరాబాద్‌లో నిన్న వాన బీభత్సం: మరోవైపు నిన్న రాత్రి హైదరాబాద్‌లో వాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా కురిసిన కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్లు పూర్తిగా మునిగిపోవటంతో ప్రజలు రోడ్లపై ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. శివారులోని పేట్ బషీరాబాద్ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది.
చుట్టు పక్కల ప్రాంతాల్లో అపార్టుమెంట్‌లు కడుతుండటంతో వరద నీరు నిలిచిపోతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో రహదారులపై భారీగా వరద ప్రవహిస్తోంది. దీంతో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మోకాళ్ల లోతులో నీరు ప్రవహించడంతో ద్విచక్రవాహనాలు పాడైపోతున్నాయి.
సైకిళ్లపై వెళ్లే కొంతమంది విద్యార్థులు అదుపు తప్పి పడిపోయారు. అల్వాల్‌లోని పలు కాలనీల్లో ఇల్లు నీట మునిగాయి. బోయిన్‌పల్లిలోని రామన్నకుంట చెరువు నుంచి నీరు రహదారిపై నుంచి ప్రవహిస్తోంది. ఖార్ఖాన గణేష్ నగర్ కాలనీలో అపార్ట్మెంట్లలోకి వరద చేరింది. వెస్ట్ వెంకటాపురం ప్రాంతంలో ఇళ్లలోకి వరద రావటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సుచిత్ర నుంచి కొంపల్లి వరకు భారీగా ట్రాఫిక్: మేడ్చల్ జిల్లా సుచిత్ర నుంచి కొంపల్లి వరకు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ భారీ వర్షానికి కుత్బుల్లాపూర్ కొంపల్లి నుంచి దూలపల్లి వెళ్లే ప్రధాన రహదారి కోతకు గురైంది. ప్రధాన రహదారిపై నీటి ప్రవాహం మోకాలి లోతులో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఈ మార్గంలో వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
అత్యవసరంగా వెళ్లేవారు ఒకరికొకరు సహాయం తీసుకొని వరద నీటిలో నుంచి రోడ్డును దాటుతున్నారు. జీడిమెట్ల, సూరారమ్ తదితర ప్రాంతాలలో ఉన్న చెరువులు పూర్తిగా నిండి నీరు పొంగడంతో రోడ్డు పై ప్రవహిస్తుంది.
ఇవీ చదవండి: హైదరాబాద్‌లో వరద ముంపులోనే పలు కాలనీలు.. నిద్ర, తిండి లేక జనం అవస్థలు
వరదతో హైదరాబాద్‌లో ట్రాఫిక్‌కు అంతరాయం
అటెండర్‌గా పనిచేసిన కాలేజీకి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా.. డ్యూటీ చేస్తూనే చదువుతూ..