WEATHER REPORT: రాష్ట్రంలో రాగల మూడు రోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 7వ తేదీన మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రాబోయే 48 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వెల్లడించింది.
మరోవైపు ప్రస్తుతం నడుస్తున్నది వానాకాలమైనా.. అనూహ్యమైన వేడి.. మండు వేసవి మాదిరిగా ఉక్కపోతలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. శనివారం ఆదిలాబాద్ జిల్లా అర్లి గ్రామంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 39 డిగ్రీలు, ఆదిలాబాద్ పట్టణంలో 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత పదేళ్ల సెప్టెంబరు నెల చరిత్రలో ఇంత అత్యధిక ఉష్ణోగ్రత నమోదవడం ఇదే తొలిసారి అని వాతావరణశాఖ తెలిపింది. ఆదిలాబాద్‌లో 2015 సెప్టెంబరు 11న అత్యధిక ఉష్ణోగ్రత 35.8 డిగ్రీలు నమోదైనట్లు రికార్డు ఉంది. ఇప్పుడు దాని కంటే 3.2 డిగ్రీలు పెరిగింది.
కిషన్‌బాగ్‌లో రాత్రిపూటే 27.5 డిగ్రీలు శుక్రవారం రాత్రి రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా హైదరాబాద్‌లోని కిషన్‌బాగ్‌లో 27.5 డిగ్రీలు, ఎల్‌బీ స్టేడియం వద్ద 25.6, భద్రాచలంలో 27 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో సెప్టెంబరు నెలలో రాత్రిపూట సాధారణ ఉష్ణోగ్రత 22.3 డిగ్రీలుంటుంది. ఇప్పుడు 3 డిగ్రీలకు పైగా పెరిగిపోయింది.
పంటలపైనా ప్రభావం: ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 2 డిగ్రీల కంటే ఎక్కువ పెరిగితే పైర్ల ఎదుగుదల, దిగుబడులపైనా ప్రభావం పడుతుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల సోయాచిక్కుడు, మొక్కజొన్న, మినుము, పెసర తదితర పంటల గింజలు గట్టి పడకుండా దిగుబడి తగ్గే ప్రమాదముందని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకుడు డాక్టర్ జగదీశ్వర్ చెప్పారు.
అధిక వేడి వల్ల ఇళ్లు, పరిశ్రమలు, వ్యవసాయానికి విద్యుత్తు వినియోగం బాగా పెరిగింది. గరిష్ఠ విద్యుత్ డిమాండు శనివారం 12,860 మెగావాట్లుగా నమోదైంది. గత ఏడాది సెప్టెంబరు 3న డిమాండు 8416 మెగావాట్లు మాత్రమే.
ఇవీ చదవండి:Teachers Day 2022: ప్రథమ నమస్కారం గురువుకే ఎందుకో తెలుసా?
గణేశ్ నిమజ్జనంలో మత సామరస్యం.. ముస్లిం అంత్యక్రియల కోసం ఏం చేశారంటే?