రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో ఒకటి, రెండుచోట్ల భారీ వర్షం.. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్ తీరం వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని.. దాని ప్రభావంతో రేపు ఉత్తర, పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది.
ఇవాళ ఉపరితల తూర్పు విదర్భ పరిసర ప్రాంతాల్లో 3.1 కి.మీ వద్ద మరో ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్రంలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని.. రేపు, ఎల్లుండి పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సంచాలకులు తెలిపారు.
భాగ్యనగరంలో వాన..
మరోవైపు భాగ్య నగరంలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం వర్షం కురిసింది. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్నగర్, నాగోల్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఒక్కసారిగా కురిసిన వానతో వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చిన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి.. నీళ్లను మళ్లించారు.