Rainfall in Telangana : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. హైదరాబాద్ శేరిలింగంపల్లి పరిధిలో రాత్రి కురిసిన వర్షానికి మియాపుర్, చందానగర్, మాదాపుర్ గచ్చిబౌలి రాయదుర్గం(Rayadurgam) ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. లింగంపల్లి రైల్వే అండర్ పాస్ నీట మునిగి.. గచ్చిబౌలి మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Rain Alerts in Telangana : తెలంగాణలో రాగల మూడు రోజుల్లో వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ..
భాగ్యనగరంలో ఒక్కసారిగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ.. పూర్తిగా నీట మునిగాయి. దీంతో రాత్రి వేళ ఇళ్లకు వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. రోడ్లపై నీళ్లు నిలిచి ఉండడంతో ఎక్కడ గుంత ఉందో.. ఎక్కడ రోడ్డు ఉందో తెలియక సతమతమయ్యామని ద్విచక్రవాహనదారులు వాపోతున్నారు. మహబూబాబాద్(Mahabubabad) జిల్లా అంతటా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. కేసముద్రం మండలం అర్పణపల్లి వంతెన పైనుంచి వట్టివాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో కేసముద్రం, గూడూరు మధ్య వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.
Weather Alert in Telangana : మెదక్ జిల్లాలో కురిసిన ఎడతెరిపి లేని వానలకు శివ్వంపేటలో చెరువు అలుగు పారుతోంది. ఏడేళ్ల తర్వాత పెద్దచెరువు నిండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురస్తున్నాయి. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో అత్యధికంగా 141 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా నల్గొండ జిల్లాలోని కంగల్లో 77.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
Telangana Weather Report Today : బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజులు భారీ వర్షాలు
వానలకు గోడ కూలి ముగ్గురు మృతి : రాత్రి కురిసిన భారీ వర్షాలకు అకస్మాత్తుగా గోడ కూలి ముగ్గురు మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. శాయంపేట మండల కేంద్రానికి చెందిన మోరె పెద్ద సాంబయ్య, మాందారిపేట గ్రామానికి చెందిన సారక్క, జోగమ్మ ఆటో ఎక్కేందుకు రోడ్డుపై వెళ్తున్న క్రమంలో ముష్క భాగ్యానికి చెందిన ఇంటి గోడ అకస్మాత్తుగా కూలి అక్కడే ఉన్న మోరె పెద్ద సాంబయ్య, సారక్క, జోగమ్మలపై పడింది. ఈ క్రమంలో సాంబయ్య, సారక్క ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. తీవ్ర గాయాల పాలైన జోగమ్మను సమీప ఆసుపత్రికి(Hospital) తరలించారు. చికిత్స పొందుతూ జోగమ్మ ప్రాణాలు విడిచింది.
వర్షం ధాటికి నిలిచిన బొగ్గు ఉత్పత్తి : ఎడతెరపని వర్షాలకు మంచిర్యాల జిల్లాలోని సింగరేణి(Singareni) ఉపరితల గనులలో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. శ్రీరాంపూర్ ,కళ్యాణిఖని, ఇందారం, రామకృష్ణాపూర్ ఉపరితల గనులలో వరద నీరు చేరడంతో బొగ్గు వెలికి తీసే యంత్రాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. బొగ్గు నిల్వల నుంచి స్థానిక సీఎస్పీకి బొగ్గును రవాణా చేస్తున్నారు. గనులలో నిలిచిన వరద నీటిని భారీ మోటార్ల సాయంతో సింగరేణి అధికారులు బయటకు పంపిస్తున్నారు. జిల్లాలోని కళ్యాణి ఖని, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్, ఇందారంలోని ఉపరితల గనులలో రోజుకు 40 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది.
Telangana Weather Report Today : బీ అలర్ట్.. రాష్ట్రంలో రానున్న మూడు రోజులు వర్షాలు