హైదరాబాద్‌లో వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదల నుంచి కోలుకోకముందే... నగరంలో వర్షం కురుస్తోంది. వర్షానికి రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిప్రాంతాల్లో... రోడ్లపైకి మోకాలి లోతు నీరు చేరింది. కార్యాలయాల నుంచి బయల్దేరే ఉద్యోగులు... తడుస్తూనే ఇళ్లకు వెళ్తున్నారు.
ట్రాఫిక్ జామ్
ఎల్బీనగర్, మన్సురాబాద్, నాగోల్, వనస్థలిపురం, బీఎన్ రెడ్డి నగర్, హయాత్ నగర్, పెద్ద అంబర్ పేట్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు విజయవాడ రహదారిపై వర్షపు నీరు చేరడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. చింతలకుంట, పనామా కూడలి, నాగోల్ రోడ్డు వద్ద వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రోడ్లన్నీ జలమయం
తార్నాక, నాచారం, లాలాపేట్, ఓయూ క్యాంపస్, మల్లాపూర్ ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. నాచారం భవాని నగర్లో భారీ వర్షానికి రోడ్డు నదిని తలపిస్తోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కోఠి, రాంకోఠి, కింగ్ కోఠి, సుల్తాన్ బాజార్, బేగంబజార్, అబిడ్స్, సైఫాబాద్, లక్డికపూల్, బషీర్‌బాగ్, లిబర్టీ, నారాయణ గూడా, హిమాయత్ నగర్ తదితర ప్రాంతాలలో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు ఇబ్బంది పడ్డారు.
రహదారిపై భారీగా వరదనీరు
వర్షం కారణంగా గోల్నాక కొత్త వంతెనపై భారీగా వాహనాలు నిలిచాయి. ట్రాఫిక్ పోలీసులు మూసారంబాగ్ వంతెనపై రాకపోకలను నిషేధం విధించారు. వంతెనపై నుంచి వాహనాల దారి మళ్లింపుతో రద్దీ పెరిగింది. ఉప్పల్‌లో వరంగల్ జాతీయ రహదారిపై వరద నీరు వచ్చి చేరింది. వరద కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. వర్షం కారణంగా మల్లాపూర్ డివిజన్‌లోని... బ్రహ్మపురికాలనీ, గ్రీన్ హిల్స్ కాలనీ, మర్రిగూడ కాలనీ వీధులు జలమయమయ్యాయి.
రంగంలోకి జీహెచ్ఎంసీ సిబ్బంది
శంషాబాద్, మల్కాజిగిరిలో ఉరుములతో కూడిన వర్షం కురుస్తోంది. వర్షాల వల్ల టోలిచౌకి- బృందావన్ కాలనీ, షేక్‌పేట రోడ్డులో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పాతబస్తీ బాబానగర్‌లో నీరు భారీగా పారుతోంది. బాలాపూర్ చెరువు నీళ్లతో వీధులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో... జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. అత్యవసర బృందాలను గ్రేటర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ అప్రమత్తం చేశారు. నగరంలో నీరు నిల్వ అయ్యే ప్రాంతాలకు ఇప్పటికే సిబ్బందిని పంపించారు. రహదారులపై నిలిచిన నీటిని తొలగించేందుకు సిబ్బంది చర్యలు చేపట్టారు.
మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన లోతట్టు ప్రాంతాలు క్రమంగా కోలుకుంటున్నాయి. మళ్లీ వర్షం పడుతుండటంలో నగరవాసుల్లో ఆందోళన మొదలైంది.