రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా కురుసిన వర్షాలు తగ్గినట్లే తగ్గి మళ్ళీ మొదలయ్యాయి. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, బేగంపేట, అమీర్‌పేట్, ఖైరతాబాద్, లక్డీకపూల్, వనస్థలీపురం, ఎల్బీనగర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. అబర్ పేట్, నల్లకుంట, ఆరంఘర్ పరిసర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. వర్ష సూచనతో అప్రమత్తమైన మాన్సూన్ యాక్షన్ టీమ్, విపత్తు నిర్వహణ బృందాలను జీహెచ్ఎంసీ రంగంలోకి దింపింది.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. నాలుగు రోజుల నుంచి కురిసిన వర్షాలతో పంటలు నీట మునిగి అన్నదాతకు అపార నష్టం మిగిల్చింది. నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని 3 వార్డులో భారీ వర్షాలకు...3 ఇళ్లు నేలమట్టమయ్యాయి. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం వేపలగడ్డ తండాకు చెందిన ఓ వృద్ధురాలు... అశ్వరావుపల్లి రిజర్వాయర్ నీటిలో ప్రమాదవశాత్తు పడి మృతిచెందింది.
కన్నీళ్లు మిగిల్చింది
భద్రాచలంలో ముంపునకు గురై ఇబ్బందులు పడుతున్న బాధితులకు.... ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ సాయం అందించారు. భారీ వర్షాలకు రామప్ప సరస్సు జలకళ సంతరించుకుంది. వరద నీరు భారీగా చేరి జంగాలపల్లి, బండారుపల్లి, పాపయ్యపల్లి ముంపునకు గురయ్యే అవకాశం ఉందని... ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో చేపలను పట్టేందుకు వెళ్లి వరద ప్రవాహాంలో మృత్య్సకారుడు గల్లంతయ్యాడు. వికారాబాద్ జిల్లా తాండూరులో కాగ్నానదిలో పడి ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు.
నేడు భారీ, రేపు అతి భారీ వర్ష సూచన
బంగాళాఖాతం ఈశాన్య ప్రాంతంలో 5.8 కి.మి. ఎత్తు నుంచి 7.6 కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. గురువారం మరింత బలపడి పశ్చిమ దిశగా పయనిస్తుందని అంచనా. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం, గురువారం అతిభారీగా వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు.
ఇవీ చూడండి: కాళేశ్వరం ప్రాజెక్టుకు తగ్గిన వరద నీటి తాకిడి!