Railway D Group Exam 2021: రైల్వేశాఖలో గ్రూప్ ‘డి’ పోస్టుల భర్తీ ప్రక్రియ ఫిబ్రవరి 23వ తేదీన పునఃప్రారంభం కానుంది. కరోనా కారణంగా నియామక ప్రక్రియ ఆలస్యమైంది. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి కంప్యూటర్ బేస్డ్ పరీక్ష(సీబీటీ)లను దశలవారీగా నిర్వహించనున్నట్లు రైల్వేశాఖ గురువారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో కలిపి 1,03,769 పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు రెండేళ్ల క్రితమే నోటిఫికేషన్ జారీ చేసింది. దక్షిణమధ్య రైల్వేలో 9,328 పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. వీటిలో ట్రాక్‌మన్ విభాగంలో 4,753, పాయింట్స్‌మెన్‌లు 1,949, హాస్పిటల్ అటెండెంట్లు 37, మిగతావి ఇతర విభాగాల పోస్టులు ఉన్నాయి.
తిరస్కరణ దరఖాస్తులకు మరోసారి అవకాశం
ఫొటో, సంతకం సరిగా లేకపోవడం వంటి కారణాలతో 4,85,607 దరఖాస్తుల్ని రైల్వేశాఖ తిరస్కరించింది. ఈ అభ్యర్థులకు తమ దరఖాస్తుల్ని ఎడిట్ చేసుకుని.. ఫొటో, సంతకాల్ని తిరిగి అప్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తామని.. ఆ లింక్‌ని డిసెంబరు 15న విడుదల చేస్తామని వెల్లడించింది. ఈ నెల 26 వరకు సికింద్రాబాద్ సహా అన్ని ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్లలో ఆ లింక్ అందుబాటులో ఉంటుందని రైల్వేశాఖ తెలిపింది. పరీక్ష నిర్వహించే పట్టణాలు, కేంద్రాల వివరాలను ఆర్‌ఆర్‌బీ వెబ్‌సైట్‌లో 10 రోజుల ముందు అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. పరీక్ష తేదీకి నాలుగు రోజుల ముందు హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.
ఇదీ చూడండి: RAILWAY: క్రమక్రమంగా పెరుగుతున్న రైళ్ల సంఖ్య