సామాన్య ప్రయాణికులకు రైలు ప్రయాణం భారంగా మారనుంది. అతి చవక ఛార్జీలతో ప్రయాణాన్ని అందించడంతోపాటు దాదాపు ప్రతి స్టేషన్‌లో ఆగే ప్యాసింజర్ రైళ్ల సేవలు గ్రామీణ ప్రాంతాలకు దూరం కానున్నాయి. దేశవ్యాప్తంగా 362 ప్యాసింజర్, డెము, మెము రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మారుస్తూ రైల్వేబోర్డు మంగళవారం పచ్చజెండా ఊపింది. కరోనా కష్టకాలంలో రైల్వేశాఖ గప్‌చుప్‌గా ఈ నిర్ణయం తీసుకుంది.
దేశవ్యాప్తంగా 17 జోన్ల పరిధిలో 362 ప్యాసింజర్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మారిస్తే.. అత్యధికంగా 47 రైళ్లు దక్షిణ మధ్య రైల్వే నుంచే ఉన్నాయి. వీటిలో నాలుగు మహారాష్ట్ర, మిగిలిన 43 రైళ్లు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల పరిధిలో తిరిగేవి. వీటిలో ప్రాచుర్యం పొందిన కాకతీయ ఫాస్ట్ ప్యాసింజర్, సికింద్రాబాద్-రేపల్లె రైళ్లు కూడా ఉన్నాయి. ద.మ. రైల్వే జోన్ తర్వాత అధికంగా నార్త్ వెస్ట్రన్ రైల్వే జోన్లో 43, సదర్న్, సెంట్రల్ రైల్వేజోన్ల నుంచి 36 చొప్పున ప్యాసింజర్ రైళ్లు, ఎక్స్‌ప్రెస్‌లుగా మారనున్నాయి. అన్ని జోన్లతో పోల్చుకుంటే దక్షిణ మధ్య రైల్వేపై అధిక ప్రభావం పడనుంది.
ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చడం వల్ల వేగం పెరుగుతుందని రైల్వేవర్గాలు చెబుతున్నాయి. కానీ అసలు కారణం మాత్రం నిర్వహణ ఖర్చులు తగ్గించుకుని.. టికెట్ల రూపంలో ఆదాయం పెంచుకోడమేనని తెలుస్తోంది. రైల్వేబోర్డుకు ఆదాయం పెరిగే అవకాశాలు ఉండొచ్చు కానీ, టికెట్ ఛార్జీలు పెరిగితే సామాన్య ప్రయాణికులు భరించలేరు. పైగా ఎక్స్‌ప్రెస్ రైళ్లు కొన్ని స్టేషన్లలోనే ఆగుతాయి. గ్రామాల నుంచి దగ్గరి పట్టణాలు, నగరాలకు వచ్చిపోయే వారిపైన భారం పడుతుంది. చాలా స్టేషన్లలో స్టాపేజీలను ఎత్తేస్తారు. దీంతో కొంతదూరం వరకు రోడ్డుమార్గంలో వెళ్లి రైలు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లేదా మొత్తం దూరం రోడ్డు ప్రయాణం చేయాల్సి వస్తుంది.
ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చిన కొన్ని రైళ్ల వివరాలు:
* కాజీపేట-బళ్లార్ష, భద్రాచలం రోడ్-సిర్పూర్ టౌన్, బళ్లార్ష-భద్రాచలం రోడ్, విజయపుర-బొల్లారం, హైదరాబాద్-విజయపుర, అజ్ని-కాజీపేట, కాజీపేట-అజ్ని, కాచిగూడ-కర్నూలు సిటీ, కర్నూలు సిటీ-కాచిగూడ, కాచిగూడ-నాగర్‌సోల్, నాగర్‌సోల్-కాచిగూడ, హైదరాబాద్-పర్బని, పర్బని-హైదరాబాద్, సికింద్రాబాద్-మణుగూరు, మణుగూరు-సికింద్రాబాద్, సికింద్రాబాద్-రేపల్లె, రేపల్లె-సికింద్రాబాద్, గుంటూరు-కాచిగూడ, కాచిగూడ-గుంటూరు, కాచిగూడ-రాయచూరు, రాయచూరు-కాచిగూడ.
ఇదీ చదవండి: రోజుకు లక్ష మంది.. మెట్రోకు పెరుగుతున్న రద్దీ